ఆంధ్రుల కలల రాజధానికి ఢిల్లీ బాట - కేంద్ర కేబినెట్ ఆమోదమే తరువాయి…
రాజధాని ఒక పవిత్ర యజ్ఞం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు….
అమరావతి బలోపేతం - కేంద్రం చేతికి ఏపీ భవిష్యత్తు బిల్లు…
Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు శాసనసభలో ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, దానికి కేంద్రం పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని ఈ తీర్మానం ద్వారా కోరారు. గతంలో ఎదురైన న్యాయపరమైన, రాజకీయపరమైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పష్టతనిచ్చారు. అమరావతి రాజధాని బిల్లు ఈరోజే కేంద్రానికి చేరుతుందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై చర్చ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేస్తుందని, ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇది ఐదున్నర కోట్ల ఆంధ్రుల కల సాకారమయ్యే దిశగా పడుతున్న అతిపెద్ద అడుగు అని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా భావోద్వేగంగా ప్రసంగించారు. రాజధాని నిర్మాణం అనేది ఒక పవిత్ర యజ్ఞమని, ఇందులో భాగస్వాములయ్యే అవకాశం సభలోని సభ్యులందరికీ లభించిందని అన్నారు. 2014లో విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యతను ప్రజలు చంద్రబాబుకు అప్పగించారని, అప్పుడే రాజధాని సంకల్పం జరిగిందని గుర్తు చేశారు. అయితే మధ్యలో వచ్చిన అడ్డంకులు రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధాని వంటి కీలక నిర్ణయాలు మార్చడం రాష్ట్ర భవిష్యత్తుకు క్షేమకరం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల మేరకు అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి రథానికి ఇకపై ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడదని, అమరావతి నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.