1875 క్లస్టర్లలో టీడీపీ మహానాడు నిర్వహణ..
‘స్త్రీ శక్తి మహానాడు’గా ఈసారి టీడీపీ మహానాడు..
అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడును రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడు ఏర్పాట్లపై రాష్ట్రంలోని 1875 క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ఆయన ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, అది తెలుగుదేశం పార్టీ బలం, క్రమశిక్షణ, త్యాగం, సంస్థాగత స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీగా టీడీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో మహానాడును వర్చువల్‌గా నిర్వహించాల్సి వచ్చిందని గుర్తుచేసిన లోకేష్, అనంతరం ఒంగోలులో జరిగిన మహానాడు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించామని తెలిపారు. ఈసారి “స్త్రీ శక్తి మహానాడు” థీమ్‌తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మహిళలకు పెద్దపీట వేయడమే లక్ష్యమని చెప్పారు.
నెల్లూరులో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించాలని భావించినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు మరియు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో ఈసారి హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నామని వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొంటారని, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రాల్లో వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి క్లస్టర్‌లో కుటుంబ సాధికార సారధి నుంచి బూత్ ఇంఛార్జ్‌లు, గ్రామ కమిటీలు, క్లస్టర్ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలని లోకేష్ సూచించారు. క్లస్టర్ వ్యవస్థను బలోపేతం చేయడమే పార్టీ లక్ష్యమని, ఇది నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని పెంచే మంచి అవకాశమని చెప్పారు.
మహానాడు నిర్వహణ కోసం పార్టీ తరఫున అవసరమైన మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. క్లస్టర్ కేంద్రాల్లో ఎల్ఈడీ టీవీలు, స్పీకర్లు, సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మై టీడీపీ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తామని చెప్పారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, కేఎస్ఎస్ సభ్యులు, అనుబంధ విభాగాలు, బూత్ కమిటీలు, గ్రామ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపించాలని లోకేష్ సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రతి కార్యకర్త దీన్ని బాధ్యతగా తీసుకోవాలని ఆయన అన్నారు. “వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థే శాశ్వతం” అని పేర్కొంటూ, పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు క్లస్టర్ ఇంఛార్జ్‌లకు కీలక బాధ్యతలు అప్పగించామని చెప్పారు.
గత 23 నెలలుగా సుమారు 60 నియోజకవర్గాల్లో పర్యటించానని, 25 నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించామని లోకేష్ తెలిపారు. ప్రజలతో మమేకం అవుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మై టీడీపీ యాప్ ద్వారా చురుకైన కార్యకర్తలను గుర్తిస్తున్నామని చెప్పారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరూ క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల, పట్టణ, డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.