- రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖామాత్యులు శ్రీమతి ఎస్. సవిత..
- చేనేతను ఆదరిద్దాం.. మన కళాకారుల కుటుంబాలకు చేయూతనిద్దాం..
AP Politics Minister Savita: స్థానిక శేషసాయి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళా (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన) – 2026 ను సాయంత్రం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖామాత్యులు శ్రీమతి ఎస్. సవిత సందర్శించారు.. ఈ సందర్భంగా మంత్రి ఎస్. సబిత మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో, అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో చేనేత వస్త్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేసి కళాకారుల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ముడి సరుకులపై సబ్సిడీ, నెట్ ఫండ్ అందజేస్తూ, ఆధునిక డిజైన్లపై శిక్షణ అందిస్తున్నామన్నారు. పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీ కల్పించడం ద్వారా కార్మికుల ఉత్పాదకతను పెంచుతున్నామన్నారు.
‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం అన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, మదనపల్లి ప్రాంతాల చేనేత కళాకారులు, దేశవ్యాప్తంగా ఇక్కడ 112 స్టాల్స్ ఏర్పాటు చేస్తే అందులో రాష్ట్రానికి చెందినవి 47 స్టాల్స్ ఉన్నాయన్నారు. ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు నెలకు ₹4,000 పెన్షన్ అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుండి చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, మా మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు చేనేత వస్త్రాలను ధరిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ప్రతి పండుగకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు ఈ ప్రదర్శనలో దాదాపు రూ. 47,35,000/- అమ్మకాలు పైగా మార్చి 18 నుంచి జరిగాయని, త్వరలో అమ్మకాలు రూ. 4 కోట్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నగర ప్రజలు మరింతగా ఈ ప్రదర్శనను ఆదరించాలని, మార్చి 31 వరకు కొనసాగుతుందన్నారు. స్టాక్స్, డిజైన్ల వైవిధ్యం, వినియోగదారుల స్పందన వల్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన కళాకారులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, భోజన వసతి, నివాస సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేనేతలతో పాటు గౌడ, రజక, వడ్డెర వంటి అన్ని బీసీ వర్గాలకు సముచిత గౌరవం, అభివృద్ధి అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి ఎస్. సబిత పేర్కొన్నారు.
మాజీ జెట్పీ చైర్ పర్సన్ గద్దె అనురాద మాట్లాడుతూ.. భారతదేశ ఆత్మ నూలు పోగులో ఉందని.. ఇదే నూలు పోగు ఈరోజు దేశం మొత్తాన్ని, అన్ని రాష్ట్రాలని కలిపి ఉంచుతోందన్నారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ ఉత్పత్తులు హ్యాండ్ లూమ్స్ అన్నీ కూడా ఒకే వేదికపై ఏర్పాటు చేశారన్నారు... చేనేత కార్మికులు అనే కంటే చేనేత కళాకారులు వాళ్ళల్లో ఉన్న కళను, సృజనాత్మకతను మొత్తం రంగరించి ఆ నూలు పోగును నేసి వస్త్రాలుగా మనకు అందిస్తారన్నారు. వ్యవసాయం రంగం తర్వాత మనకు ఉపాధి ఎక్కువగా చేనేత రంగం ద్వారానే ఎక్కువగా కలగటం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతల్ని ఎక్కువగా ప్రోత్సహించటం జరగుతుందని మాజీ జెట్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ గుత్తు రాజారావు, తదతరులు పాల్గొన్నారు.