CM Chandrababu Delhi Tour Updates: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సోమవారం సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం కావాలని ఆయన కోరారు.
ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్-2.0 (SBM-U 2.0) కింద ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే పలు పారిశుద్ధ్య ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి వీటికి సంబంధించి కేంద్ర వాటా కింద రావాల్సిన రూ.105 కోట్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో పారిశుద్ధ్య వ్యవస్థ కుంటుపడిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 'స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం మంత్రికి వివరించారు. గ్రామాల్లో మరియు పట్టణాల్లో చెత్త సేకరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఈ నిధులు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారు. పట్టణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవను అభినందించిన ఆయన, స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. రూ.105 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఖట్టర్ పేర్కొన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంపొందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచవచ్చని, ఆ దిశగా చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ 2.0 నిధులతో రాష్ట్రంలోని నగరాలు మున్సిపాలిటీలను గార్బేజ్ ఫ్రీ సిటీస్'గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ ఆధునిక యంత్రాల సాయంతో చెత్త నిర్మూలన చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న నిధులపై సీఎం జరుపుతున్న ఈ వరుస భేటీలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.