పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
రాష్ట్ర కమిటీ మొత్తం పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉండాలని నిర్ణయం..
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి కొత్త తరహాలో జరగనుంది. పార్టీ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు జారీ చేశారు.
రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాన్ని పూర్తిగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రతినిధులు ఆన్‌లైన్ వేదికల ద్వారా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ తప్పనిసరిగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మహానాడు సందర్భంగా జరిగే సమావేశాలు, తీర్మానాలు, చర్చల్లో రాష్ట్ర కమిటీ సమిష్టిగా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అలాగే క్లస్టర్ స్థాయి ప్రతినిధులు కూడా వర్చువల్ ద్వారా మహానాడులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, మండలం స్థాయికి మహానాడు కార్యక్రమాన్ని చేరవేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు వెళ్తోందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ భవన్‌లో స్టేజీ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసి ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాంకేతికతను వినియోగిస్తూ పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించినప్పటికీ మహానాడుకు ఉండే ప్రాధాన్యం, ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
టీడీపీ ఆవిర్భావం నుంచి మహానాడు కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరిగే కీలక వేదికగా మహానాడు నిలుస్తుంది. ఈసారి వర్చువల్ రూపంలో నిర్వహించనున్న మహానాడు పార్టీ కార్యకర్తల్లో ఆసక్తిని పెంచుతోంది.