బీహార్ ఇటీవల పూర్తైన అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో NDA 200కి పైగా సీట్లు గెలుచుకొని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇందులో భారతీయ జనతా పార్టీ (BJP) దాదాపు 89 స్థానాలు, జనతా దళ్ (యునైటెడ్) JD(U) సుమారు 85 సీట్లు దక్కించుకున్నాయి. RJD-నేతృత్వంలోని మహాఘాట్‌బంధన్ కేవలం పరిమిత స్థానాలకు మాత్రమే చేరడం వల్ల అప్పటికే ప్రజాభిప్రాయం NDA వైపునే ఉన్నట్టు ఫలితాలు సూచించాయి.
ఈ ఫలితాల తరువాత NDA నాయకత్వం నితీష్ కుమార్‌ను ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు పాట్నా గాంధీ మైదానంలో భారీ స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు సమక్షంలో ఈ వేడుక జరిగేలా బీహార్ ప్రభుత్వం విశేష ఏర్పాట్లు చేసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 8 గంటలకు అమరావతి నుంచి పాట్నాకు బయల్దేరనున్నారు. గాంధీ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, నితీష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.కార్యక్రమం ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరనున్నారు.
బీహార్ ఎన్నికల్లో వచ్చిన భారీ విజయంతో నితీష్ కుమార్ మళ్లీ అధికారంలోకి రావడం, ఆ వేడుకకు దేశంలోని ప్రముఖ నాయకులు హాజరుకావడం ఈ ప్రమాణ స్వీకారాన్ని జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమంగా నిలపనుంది. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరు కావడంతో రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండవచ్చును అని విశ్లేషకులు భావిస్తున్నారు.