Greenland Protection: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్‌లాండ్ ద్వీపం విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై ఇరాన్ గట్టిగా స్పందించింది. ఒకవేళ ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేని పరిస్థితి వస్తే, యూరోపియన్ యూనియన్ తమను సంప్రదించాలని, తాము ఆ ద్వీపాన్ని రక్షించేందుకు సిద్ధమని ఇరాన్ సైన్యం ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ట్రంప్ తొలుత గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని ఈయూని డిమాండ్ చేశారని, ఆ తర్వాత బతిమిలాడారని ఇరాన్ ఆరోపించింది. ఇప్పుడు ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు సహకరించకపోతే గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా లాక్కుంటామని ట్రంప్ బెదిరిస్తున్నారని ఇరాన్ సైనిక ప్రతినిధి మండిపడ్డారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈయూ గనుక పిలిస్తే, వెంటనే అక్కడికి చేరుకుని గ్రీన్‌లాండ్ రక్షణ బాధ్యతలు చేపడతామని ఇరాన్ స్పష్టం చేసింది.
మరోవైపు, హిందూ మహాసముద్రంలోని డియాగో గార్షియాలో ఉన్న బ్రిటన్, అమెరికా సంయుక్త సైనిక స్థావరంపై జరిగిన మిస్సైల్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ దాడిలో రెండు బాలిస్టిక్ క్షిపణులు వాడారని అమెరికా మీడియా ప్రచారం చేస్తున్నప్పటికీ, అంత దూరం ప్రయాణించే క్షిపణులు తమ వద్ద లేవని ఇరాన్ వాదిస్తోంది. తమ మిస్సైళ్ల రేంజ్ కేవలం 2000 కిలోమీటర్ల లోపేనని, డియాగో గార్షియా 4000 కిలోమీటర్ల దూరంలో ఉందని ఇరాన్ గుర్తు చేస్తోంది.
అయితే ఇరాన్ వాదనలను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్ వద్ద 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న క్షిపణులు ఉన్నాయని, ఇది కేవలం ఆసియాకే కాకుండా యూరోప్, ఆఫ్రికా దేశాలకు కూడా ప్రమాదకరమని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ తయారు చేస్తున్న లాంగ్ రేంజ్ క్షిపణులు ఇప్పుడు లండన్, పారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాలను కూడా తాకగలవని, ఇది ప్రపంచ శాంతికి ముప్పు అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
యుద్ధం తీవ్రతరం కావడంతో ఇరాన్ ప్రభుత్వం ఆ దేశంలో వరుసగా నాలుగో వారం కూడా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గత 500 గంటలుగా అక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణ ప్రజలు తమ బంధువులతో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. వీపీఎన్, శాటిలైట్ కనెక్షన్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేయడంతో అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియక ఇరాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.