Social Media Marketing: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అవ్వడం ఒకెత్తయితే, దాని ద్వారా ఆదాయం సంపాదించడం మరో ఎత్తు. ఇప్పటివరకు చాలామంది క్రియేటర్లు బ్రాండ్ ప్రమోషన్ల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన 'మెటా' కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. రీల్స్ చూస్తూనే వస్తువులను కొనుగోలు చేసేలా 'షాపింగ్ లింక్స్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
సాధారణంగా మనం ఏదైనా రీల్‌లో ఒక మంచి డ్రెస్సో లేదా గాడ్జెట్టో చూసినప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతుంటాం. క్రియేటర్లు కూడా "లింక్ బయోలో ఉంది" అని లేదా "కామెంట్ చేయండి" అని చెబుతుంటారు. దీనివల్ల యూజర్లకు విసుగు వచ్చేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ, మెటా నేరుగా రీల్‌లోనే క్లిక్ చేయగల లింకులను అనుమతిస్తోంది. దీనివల్ల ఫాలోయర్లు ఒక్క ట్యాప్‌తో వస్తువును కొనేయవచ్చు, అలాగే ఆ వస్తువు అమ్ముడైనందుకు క్రియేటర్లకు నేరుగా కమిషన్ అందుతుంది.
ఈ కొత్త విధానంలో క్రియేటర్లు తమ రీల్స్‌లో దాదాపు 30 వస్తువుల వరకు ట్యాగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకే వీడియోలో రకరకాల ఉత్పత్తులను చూపిస్తూ ఆదాయం పెంచుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా పెద్ద పెద్ద వెబ్‌సైట్లకు వెళ్లాల్సిన పనిలేదు. అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా తమ అకౌంట్లను లింక్ చేసుకుంటే సరిపోతుంది. అమెరికాలో అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి మెటా ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించింది.
చాలామందికి ఉండే సందేహం ఏంటంటే.. "మాకు లక్షల్లో ఫాలోయర్లు లేరు కదా, మాకు డబ్బులు వస్తాయా?" అని. దీనికి సమాధానం 'అవును'. ఇప్పుడు బ్రాండ్లు కేవలం ఫాలోయర్ల సంఖ్యను మాత్రమే చూడటం లేదు. మీ వీడియోలను ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది స్పందిస్తున్నారు అనే దానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. తక్కువ ఫాలోయర్లు ఉన్నా సరే, మీరు చేసే కంటెంట్ బాగుంటే ఈ అఫిలియేట్ లింక్స్ ద్వారా మంచి ఆదాయం గడించవచ్చు.
భారతదేశంలో కూడా త్వరలోనే ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సింగపూర్, మలేషియా వంటి ఆసియా దేశాల్లో ఇది అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది క్రియేటర్లకు ఇది ఒక గొప్ప వరమని చెప్పాలి. కేవలం వినోదం కోసమే కాకుండా, క్రియేటివిటీని వాడుకుంటూ ఇంటి నుంచే సంపాదించుకోవడానికి ఇదొక చక్కని మార్గం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ కంటెంట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి సిద్ధమవ్వండి..