Telangana Housing Scheme: తెలంగాణలో సొంతింటి కల ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ.. రెండో విడత కేటాయింపులపై అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందే సాయం, పంపిణీ గడువు మరియు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
మంత్రి పొంగులేటి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించగా, ప్రస్తుతానికి లక్షా 12 వేల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా ఈ ప్రకటనతో పెద్ద ఊరట లభించింది. సగం నిర్మించి ఆగిపోయిన ఇళ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇంటి నిర్మాణ దశను బట్టి ఆర్థిక సాయం అందుతుందని, దీనివల్ల సొంతంగా ఇల్లు కట్టుకుంటూ నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ఊరికి దూరంగా ఇళ్లు ఇవ్వడం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపలేదని గుర్తించిన సర్కార్, ఇప్పుడు ఆ తప్పు జరగకుండా చూస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 14 నుంచి 15 మురికివాడలను గుర్తించి, అక్కడి ప్రజల సౌకర్యార్థం దగ్గరలోనే ఇళ్లు నిర్మించబోతున్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వంటి పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా అర్హులైన పేదలందరికీ గూడు కల్పించడమే తమ ఉద్దేశమని రేవంత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత రానుంది.