ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గుడ్లు, పాలు వంటి నిత్యావసర వస్తువులపై వస్తున్న వార్తలు సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో వైద్య నిపుణులు భిన్నమైన, లోతైన విశ్లేషణను అందిస్తున్నారు. మనం భయపడుతున్న "రూపాయి సమస్య" కంటే, మనం గమనించని "కోటి రూపాయల సమస్య" మరొకటి ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి ఇచ్చిన ఫిల్టర్ మనం తీసుకునే ప్రతి మందు ఒక రకమైన 'టాక్సిన్' (విషతుల్యం) అని, దానిని మన శరీరం బయటికి పంపడానికి ప్రయత్నిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే, మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలను రక్షించడానికి ప్రకృతి అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది.
బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్: మెదడు కణాలకు హాని కలగకుండా రక్తంలోని మలినాలను ఇది అడ్డుకుంటుంది.
బ్లడ్ ప్లాసెంటల్ బ్యారియర్: గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి రక్తంలోని టాక్సిన్స్ బిడ్డకు చేరకుండా 'మాయ' (Placenta) ఒక ఫిల్టర్‌లా పనిచేస్తుంది.
పాల ఉత్పత్తి: తల్లి ఇచ్చే పాలు కూడా నేరుగా కాకుండా ఒక ఫిల్టర్ ద్వారానే బిడ్డకు చేరుతాయి. అందుకే ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆహారం ఎప్పుడూ సురక్షితమని నిపుణుల అభిప్రాయం.
గుడ్లు, పాలపై ప్రచారం.. ఎంతవరకు నిజం?
ఇటీవల కొన్ని బ్రాండెడ్ గుడ్లలో యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయనే వార్తలు కలకలం రేపాయి. దీనిపై నిపుణులు స్పందిస్తూ.. ప్రకృతి సిద్ధంగా ఒక జీవి నుంచి వచ్చే గుడ్డు లేదా పాలు అత్యంత స్వచ్ఛమైనవి. ఒక గుడ్డు అనేది ఒక కొత్త జీవం పుట్టడానికి సిద్ధంగా ఉన్న సంపూర్ణ ఆహారం. అందులోకి మలినాలు చేరడం అంత సులభం కాదు. గుడ్డు పైన ఉండే పెంకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది" అని పేర్కొన్నారు.
అసలైన ముప్పు ఎక్కడ?
మనం గుడ్లు, పాలలో ఉండే స్వల్ప మలినాల గురించి ఆందోళన చెందుతున్నాం కానీ, మనం రోజూ తినే ఆకుకూరలు, కూరగాయలు మరియు ధాన్యాలపై విచక్షణారహితంగా కొడుతున్న పెస్టిసైడ్స్ (పురుగుమందులు) అసలైన ముప్పు..
కూరగాయలకు ఎలాంటి 'నేచురల్ ఫిల్టర్స్' ఉండవు, మనం వాటిని నేరుగా తీసుకుంటాం.
పంటను కాపాడుకోవాలనే ఆరాటంలో రైతులు వాడే మితిమీరిన కెమికల్స్ వల్ల శరీరంలోకి కార్సినోజన్స్ (క్యాన్సర్ కారకాలు) చేరుతున్నాయి.
పాలు, గుడ్లను నిందించే ముందు మనం రోజువారీగా వాడే ధాన్యాల్లోని రసాయనాల గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మార్కెట్ మాయాజాలం - ఆర్గానిక్ పేరిట మోసాలు..
ఆర్గానిక్ ఆహారం పేరిట జరుగుతున్న వ్యాపార గ్రీడ్ గురించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధిక ధరలకు ఆర్గానిక్ అని అమ్మే ప్రతి వస్తువు నిజంగా స్వచ్ఛమైనదా కాదా అనేది రెగ్యులేటరీ అథారిటీలు తేల్చాల్సి ఉంది. గుడ్డులో విటమిన్లు ఇంజెక్ట్ చేశామని చెప్పే వార్తలు కేవలం మార్కెటింగ్ జిమ్మిక్కులని, ప్రకృతి సిద్ధంగా వచ్చే పోషకాలే శ్రేష్టమని వైద్యులు చెబుతున్నారు.
ఏం చేయాలి?
ఆందోళన పడటం ఆపి, తెలివైన జీవనశైలిని అలవర్చుకోవడమే దీనికి పరిష్కారం. మీకు తెలిసిన డైరీ ఫామ్స్ లేదా నమ్మకమైన వ్యక్తుల దగ్గర పాలు, గుడ్లు సేకరించండి. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేకపోవడానికి కేవలం పాలు కారణం కాదు, వారి శారీరక శ్రమ తగ్గడం, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణాలే.
రెగ్యులేటరీ బాధ్యత: ఆహార నాణ్యతను పరీక్షించి రిపోర్టులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ సంస్థలది. అవి రిపోర్టు ఇచ్చే వరకు అనవసర ప్రచారాలను నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. చివరగా చెప్పేదేంటంటే.. భూమిపై లభించే అత్యుత్తమ ఆహారాల్లో తల్లిపాలు మొదటి స్థానంలో ఉంటే, గుడ్డు రెండో స్థానంలో ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా వార్తలను చూసి భయపడి పోషకాహారాన్ని దూరం చేసుకోవద్దు