తనపై నీచాతి నీచంగా ప్రచారం చేస్తున్నారని, మార్ఫింగ్ వీడియోలతో బురద జల్లుతున్నారని బి.ఆర్. నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తన రాజీనామా కోరడంపై ఆయన మండిపడ్డారు. నన్ను రాజీనామా చేయమనడానికి అసలు మీరెవరు? నేను ఇక్కడికి వచ్చింది పదవుల కోసం కాదు, కేవలం శ్రీవారి సేవ కోసమే. నాకు ఎన్నో వ్యాపార, రాజకీయ అవకాశాలు వచ్చినా వాటన్నింటినీ వదులుకుని స్వామివారి ప్రక్షాళన కోసం ఈ బాధ్యత చేపట్టాను అని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై తాను చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మం ప్రకారం శ్రీవారిని దర్శించుకునేటప్పుడు సతీసమేతంగా రావాలని నేను ప్రశ్నించాను. అది తప్పా? జగన్ ఎందుకు ఒంటరిగా వస్తున్నారని అడిగినందుకు నా పాత ఫోటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్" అని ఆయన విమర్శించారు.
సుబ్బారెడ్డి, భూమనల పాత చరిత్ర తన దగ్గర ఉందని బి.ఆర్. నాయుడు హెచ్చరించారు. మీరు మద్రాస్ వెళ్లి ఏం చేశారో, మీ అరాచకాలు ఏంటో అన్నీ నాకు తెలుసు. అవన్నీ బయటపెట్టమంటారా? మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు. నేను చాలా స్ట్రాంగ్, అస్సలు తగ్గేదే లేదు. నా జోలికి వస్తే తోలు తీస్తా అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వలనే తాను ఆగానని, లేదంటే వీరి బండారం ఎప్పుడో బయటపెట్టేవాడినని అన్నారు.
తాను రాజకీయ నాయకుడిని కాదని, తనపై రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. టీటీడీలో వన్ మెన్ కమిషన్ విచారణను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నేను చేసిన ఒక్క తప్పైనా చూపించగలరా? నిస్వార్థంగా పనిచేస్తుంటే బురద చల్లుతారా? నా వల్ల టీటీడీకి ఒక్క చిన్న మచ్చ కూడా రాదు. పనికిమాలిన మాటలు, రాతలు కట్టిపెట్టకపోతే లీగల్ గా పోరాడతాను" అని తేల్చి చెప్పారు.తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఈ కుట్రల వెనుక ఉన్న వారి ఆటలు సాగనివ్వనని బి.ఆర్. నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.