300 రూ/- శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం..
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల..
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి తిరుమలలో భక్తుల రాక భారీగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం భక్తులు ఏటీజీ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరి దర్శనం కోసం వేచి ఉన్నారు.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 15 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటల వరకు నిరీక్షణ కొనసాగుతోంది.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కూడా 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు సహనంతో వ్యవహరించాలని, టీటీడీ సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ఇక బుధవారం ఒక్కరోజే మొత్తం 78,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 36,826 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదే రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా నమోదైంది.
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో అన్నప్రసాద కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలను టీటీడీ మరింత విస్తరించింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన వస్తువులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.