ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి వేగం పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు మరలుతున్న తీరు గణనీయంగా ఉంది. తాజాగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) 12వ సమావేశంలో భారీ నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం రూ.1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 85,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, రియల్ ఎస్టేట్, స్టీల్, సాఫ్ట్వేర్, సౌరశక్తి వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో ఇప్పటివరకు జరిగిన 12 SIPB సమావేశాల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.8.08 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.05 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది రాష్ట్ర పరిశ్రమల వృద్ధికి పెద్ద బూస్ట్‌గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులలో ఏఎమ్‌జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ రూ.44,000 కోట్లతో, ఇండిచిప్ సెమీ కండక్టర్స్ రూ.22,976 కోట్లతో, సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ రూ.8,570 కోట్లతో, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ రూ.7,972 కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నాయి. అలాగే కె.రహేజా కార్ప్, విశాఖ రియాల్టీ, ఫ్లూయింట్‌గ్రిడ్, సుగ్నా స్పాంజ్ అండ్ పవర్, బిర్లాను లిమిటెడ్, భారత్ డైనమిక్స్, డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ సంస్థల ద్వారా మాత్రమే వేలాది మందికి ఉపాధి లభించనుంది.
చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడంలో దృష్టి సారించింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల విస్తరణ, శక్తి సరఫరా, రోడ్డు-రైలు కనెక్టివిటీ, సులభమైన అనుమతుల విధానం వంటి అంశాలతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత పారిశ్రామిక హబ్‌గా అవతరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉపాధి, ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం లభించనుంది.