యూరప్ పర్యటనకు వెళ్లాలని కలగంటున్నవారికి అందుబాటులో ఉండే ఉత్తమ అవకాశం షెంగెన్ టూరిస్ట్ వీసా. ఒకే వీసాతో మొత్తం షెంగెన్ ప్రాంతంలోని 27 దేశాలు తిరిగే అవకాశం ఇస్తుంది. అంటే, ప్రతి దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకసారి షెంగెన్ వీసా పొందితే, వీసా గడువు ముగిసే వరకు ఆ దేశాల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు. షెంగెన్ ప్రాంతం ప్రధానంగా యూరోప్ ఖండంలోని దేశాలు కలసి ఏర్పాటు చేసిన వీసా-ఫ్రీ జోన్.
షెంగెన్ వీసా పొందడానికి మొదటగా చేయాల్సిన పని, మీ పాస్‌పోర్ట్ సరైన స్థితిలో ఉందో లేదో చూసుకోవడం. కనీసం ఆరు నెలల పాటు వాలిడిటీ ఉండాలి మరియు అందులో రెండు ఖాళీ పేజీలు తప్పనిసరిగా ఉండాలి. తర్వాత మీరు ఏ దేశానికి వెళ్తున్నారు అనేదానిపై ఆధారపడి వీసా అప్లై చేయాలి.
ఉదాహరణకు, మీరు ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ వెళ్లాలనుకుంటున్నా, ఎక్కువ రోజులు ఫ్రాన్స్‌లో ఉన్నట్లయితే, ఫ్రాన్స్ దౌత్య కార్యాలయంలోనే వీసా అప్లై చేయాలి. దీని తర్వాత వీసాకు అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. పాస్‌పోర్ట్, ఫోటోస్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ రిజర్వేషన్, ట్రావెల్ ఇన్సూరెన్స్ (30,000 యూరోలు కవరేజ్), బ్యాంక్ స్టేట్‌మెంట్స్ (6 నెలలు), అలాగే ఉద్యోగ వివరాలు / సాలరీ స్లిప్స్ లేదా బిజినెస్ ప్రూఫ్స్ అవసరం.
డాక్యుమెంట్లు సిద్ధం అయిన తర్వాత VFS గ్లోబల్ వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేయాలి. నిర్దేశిత తేదీన బయోమెట్రిక్స్ (fingerprints) మరియు చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంది. సాధారణంగా వీసా ప్రాసెసింగ్‌కు 15–30 రోజుల వరకు సమయం పడుతుంది.
షెంగెన్ ప్రాంతంలో ఉండే దేశాలు: ఆస్ట్రియా, బెల్జియం, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్‌లాండ్, ఇటలీ, లాట్వియా, లిక్టెన్‌స్టైన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్. ఇవన్నీ ఒకే వీసాతో చూడగలిగే దేశాలు.
షెంగెన్ వీసా ప్రయాణికులకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఒకే వీసాతో అనేక దేశాలు చూడగలగడం ఒక పెద్ద సౌకర్యం. దేశాల మధ్య ప్రయాణం రైలు, బస్సు, కార్ లేదా ఫ్లైట్‌తో చాలా సులభంగా ఉంటుంది. ఈ వీసా వలన యూరప్‌లో టూరిజం మాత్రమే కాకుండా చిన్న బిజినెస్ మీటింగ్స్, కాంకరెన్స్‌లకు కూడా హాజరు కావచ్చు (అయితే పని చేసే హక్కు మాత్రం ఉండదు). మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, షెంగెన్ వీసా మీ పాస్‌పోర్ట్‌కి మంచి క్రెడిబిలిటీ ఇస్తుంది దీని వలన భవిష్యత్తులో UK, USA, కెనడా వీసాల కోసం అప్లై చేసినప్పుడు వీసా అప్రూవల్ అవకాశాలు కూడా పెరుగుతాయి.