దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 దేశాల సదస్సుపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంలో శ్వేతజాతి రైతులపై హింస జరుగుతోందని ఆరోపిస్తున్న హింస కారణంగా, అమెరికా ఈ ఏడాది జీ-20 సదస్సును బహిష్కరించనున్నట్టు ఆయన ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జీ-20 సదస్సు నిర్వహించడం అంతర్జాతీయ స్థాయిలో అవమానకరం అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి రైతులు ఆస్తుల స్వాధీనం దాడులు, హత్యలు వంటి హింసాత్మక ఘటనలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచం ఈ దారుణాలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ హింసను అరికట్టే వరకు ఆ దేశంలో జరిగే ఏ అంతర్జాతీయ కార్యక్రమానికీ అమెరికా హాజరుకాము అని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తిప్పికొట్టింది. అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటనలో ట్రంప్‌కు అందిన సమాచారం పూర్తిగా అవాస్తమని. దేశంలో వర్ణవివక్ష వ్యవస్థ ముగిసిన ముప్పై సంవత్సరాల తరువాత కూడా తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ అధిక ఆర్థిక శక్తిని కలిగి ఉన్నారు అని రామఫోసా చెప్పుకొచ్చారు. తెల్లజాతి రైతులపై ఎటువంటి వివక్ష లేదని ప్రభుత్వం సమాన అవకాశాలను కల్పిస్తోందని ఆయన వివరించారు.
దక్షిణాఫ్రికా అధికారుల ప్రకారం ట్రంప్ చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని రాజకీయ లాభాల కోసం చేసిన వ్యాఖ్యలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో జీ-20 సదస్సు షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. నవంబర్ 22, 23 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో సదస్సు జరుగుతుందని ఇది ఆఫ్రికా ఖండంలో మొదటిసారి జరుగుతున్న చారిత్రక సమావేశమని వారు గుర్తు చేశారు.
ట్రంప్ మాత్రం తన వైఖరిని కొనసాగిస్తూ దక్షిణాఫ్రికా జీ-20 సభ్యత్వం పునఃపరిశీలన చేయాలి అని మయామిలో జరిగిన మరో సమావేశంలో అన్నారు. వచ్చే ఏడాది ఫ్లోరిడాలో జరగనున్న జీ-20 సదస్సు కోసం తాను ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు.
ట్రంప్ ఈ ప్రకటనతో అంతర్జాతీయ వేదికపై చర్చలు మళ్లీ వేడెక్కాయి. శ్వేతజాతి రైతుల హక్కుల పేరుతో అమెరికా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం దక్షిణాఫ్రికాతో ఉన్న దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంటున్నారు. మరోవైపు, జీ-20 సదస్సు సాఫీగా జరిగేలా ఆతిథ్య దేశం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.