దేశంలో అక్టోబర్ నెలలో ఆటోమొబైల్ అమ్మకాలు ఎప్పటికీ లేని స్థాయిలో జరిగాయి. పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ రేటు తగ్గింపు, కొత్త మోడళ్ల విడుదల వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తెలిపింది.
మొత్తం 40.2 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం అక్టోబర్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. అందులో ముఖ్యంగా రెండు చక్రాల వాహనాల అమ్మకాలు ఎక్కువయ్యాయి.
రెండు చక్రాల వాహనాలు ముందంజలో
FADA గణాంకాల ప్రకారం టూ వీలర్ అమ్మకాలు 51.8% పెరిగి 31.5 లక్షల యూనిట్లకు చేరాయి. బజాజ్, హీరో, టీవీఎస్, హోండా వంటి కంపెనీలు పండుగ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఆదాయం, సులభమైన రుణాల అందుబాటు కూడా దీనికి తోడ్పడినట్లు నివేదిక పేర్కొంది.
ప్యాసింజర్ వాహనాల పెరుగుదల
ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 11.4% పెరిగి 5.57 లక్షల యూనిట్లకు చేరాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, కియా కంపెనీల కొత్త మోడళ్లు ఈ వృద్ధికి ప్రధాన కారణమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, కియా సోనెట్, మారుతీ బ్రెజ్జా వంటి మోడళ్లకు ఎక్కువ డిమాండ్ కనిపించింది.
కమర్షియల్ వాహనాలు, ట్రాక్టర్లు
కమర్షియల్ వాహనాలు, ట్రాక్టర్ల విభాగంలో కూడా స్వల్పంగా వృద్ధి కనిపించింది. మౌలిక సదుపాయాల పనులు, వ్యవసాయ కార్యకలాపాలు పెరగడంతో ఈ విభాగం కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.
పండుగ ప్రభావం స్పష్టంగా
దీపావళి దసరా వంటి పండుగల సమయంలో కుటుంబాలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు రావడం, ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వడం మార్కెట్‌కు ఊతమిచ్చాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం కూడా వినియోగదారుల నమ్మకాన్ని పెంచిందని FADA అధ్యక్షుడు తెలిపారు.
జీఎస్టీ తగ్గింపులు సహకారం
కొన్ని వాహనాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల ధరలు కొంత తక్కువయ్యాయి. ఫలితంగా చిన్న కార్లు, స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ మరింత పెరిగిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఆటో రంగ నిపుణులు చెబుతున్నట్లుగాపండుగ సీజన్ తర్వాత కూడా ఈ వృద్ధి కొనసాగితే, ఆర్థిక సంవత్సరం 2025లో మొత్తం ఆటో మార్కెట్ 10-12 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల వల్ల వచ్చే నెలల్లో ఈ విభాగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా. FADA నివేదిక ప్రకారం ఈ రికార్డు స్థాయి విక్రయాలు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సానుకూల సూచికగా నిలిచాయి. రవాణా, ఇంధన, బ్యాంకింగ్ రంగాలపై కూడా ఈ వృద్ధి ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.