రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల సమాచారాన్ని ప్రజల చేతుల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కొత్త సాంకేతికత ద్వారా గ్రామీణ రహదారుల స్థితి, నిర్మాణం, మరమ్మతులపై పూర్తి సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండనుందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ముందు జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ వ్యవస్థ లక్ష్యమని చెప్పారు.
అడవి తల్లిబాట ప్రాజెక్టును పైలెట్‌గా ఎంచుకుని జియో రూరల్ రోడ్ సిస్టంను అనుసంధానించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 761 గిరిజన గ్రామాలను కలిపే 662 రహదారి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎదురవుతున్న సవాళ్లను పక్కా ప్రణాళికతో అధిగమించాలని, రూ.1,158 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని సమర్థంగా వినియోగించాలని ఆయన అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
పల్లె అభివృద్ధికి భాగంగా పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4007 కిలోమీటర్ల రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని నిధులు త్వరగా విడుదల అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. నవంబర్ మూడో వారం నుంచి స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తానని ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రజలకు ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకాన్ని వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల భయాలను తొలగిస్తూ, నిజమైన యాజమాన్య హక్కులను కల్పించడమే మన ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, సర్వే విభాగ కార్యదర్శి కూర్మనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.