- ఏడు బుల్లెట్ కారిడార్లు… త్వరలో పట్టాల మీదకు!
- మొదలైన ప్రక్రియ.. గంటకు 300 కి.మీ వేగం..
Bullet Trains Updates: భారతదేశ రవాణా రంగంలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. మనం సినిమాల్లో చూసే బుల్లెట్ రైళ్లు ఇకపై మన కళ్లముందే, మన పట్టణాల మీదుగా దూసుకుపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఏడు హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టు, సామాన్యుడి ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది.
వచ్చే 2026 సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ప్రాజెక్టు విశేషాలను, మన నిత్య జీవితంలో ఇవి తీసుకురాబోయే మార్పులను ఇక్కడ వివరంగా చర్చిద్దాం.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన మార్గాల్లో బుల్లెట్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ నెట్‌వర్క్, దేశంలోని మెట్రో నగరాలను మరియు పారిశ్రామిక కేంద్రాలను అనుసంధానిస్తుంది.
ప్రస్తుతం రైల్వే శాఖ ఈ ఏడు రూట్లకు సంబంధించిన 'డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్' (DPR)ను సిద్ధం చేస్తోంది. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం ఎంత అవుతుంది? ఎక్కడెక్కడ స్టేషన్లు ఉండాలి? అన్న విషయంపై స్పష్టత వస్తుంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ పనుల బాధ్యతను భుజాన వేసుకుంది.
2026 నుంచే పనులు.. త్వరలో పట్టాల మీదకు!
బుల్లెట్ రైలు అంటే కేవలం వేగమే కాదు, అది దేశ పారిశ్రామిక శక్తికి నిదర్శనం.
ముంబై-అహ్మదాబాద్: దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ ఇది. ఇప్పటికే దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది (2027) నాటికే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్‌లో ప్రకటించిన మిగిలిన ఏడు కారిడార్ల పనులు 2026 నుంచే క్షేత్రస్థాయిలో మొదలుకానున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోకి వస్తాయి. ఫలితంగా సివిల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, నిర్మాణ రంగాల్లో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ప్యాసింజర్ సేవల నమూనాలో మార్పు
ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే గంటల తరబడి వేచి చూడటం, ఆలస్యంగా గమ్యం చేరడం. కానీ ఇప్పుడు భారత రైల్వే తన రూపాన్ని మార్చుకుంటోంది.
వందే భారత్ & అమృత్ భారత్: ఇప్పటికే మన మధ్యకు వచ్చిన వందే భారత్ రైళ్లు మన పగటి ప్రయాణాన్ని మార్చేశాయి. సామాన్యుల కోసం అమృత్ భారత్ రైళ్లు, రాత్రి ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. బుల్లెట్ రైళ్ల రాకతో భారత రైల్వే నెట్‌వర్క్ జపాన్, యూరప్ దేశాల స్థాయికి అప్‌గ్రేడ్ అవ్వనుంది. విమానం కంటే సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
ఈ కారిడార్ల వల్ల సామాన్యుడికి కలిగే లాభం ఏమిటి?
చాలామందికి "బుల్లెట్ రైళ్లు ధనికుల కోసమేనా?" అనే సందేహం కలగవచ్చు. కానీ దీనివల్ల ప్రతి ఒక్కరికీ లాభం ఉంది. 10 గంటలు పట్టే ప్రయాణం కేవలం 3 గంటల్లోనే పూర్తవుతుంది. దీనివల్ల వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. బుల్లెట్ రైలు స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో కొత్త నగరాలు, టౌన్ షిప్ లు ఏర్పడతాయి. తద్వారా స్థానిక ప్రజల ఆదాయం పెరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతాలను బుల్లెట్ రైలుతో కలపడం వల్ల టూరిజం ఆదాయం రెట్టింపు అవుతుంది.
గంటకు 300 కి.మీ వేగం
బుల్లెట్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. హైదరాబాద్-పుణె మార్గం మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతుంది. 2 గంటల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రయాణికులతో పాటు ఆర్ధిక వ్యవస్థ కూడా ఈ లైన్ వల్ల మెరుగుపడనుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు రైలు కారిడార్ ఏపీ మీదుగా కర్ణాటక వరకు ఉంటుంది.
ఇది కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ఐటీ, తయారీ, సేవా పరిశ్రమలకు ఉపయోగపడనుంది. రెండు గంటల ప్రయాణం సమయం దీని వల్ల తగ్గుతుంది. ఇక హైదరాబాద్-చెన్నై కారిడార్ ప్రయాణ సమాయాన్ని దాదాపు గంట 13 నిమిషాలకు తగ్గిస్తుంది. దక్షిణ భారతేదేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను ఇది బలోపేతం చేస్తుంది. వీటి నిర్మాణంతో హైదరాాబాద్ రైల్వేలకు హాబ్‌గా మారనుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు కొత్త కంపెనీలు రానున్నాయి. వీటి వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగనుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడానికి వేసే బలమైన అడుగు. వందే భారత్ విజయవంతమైన తర్వాత, ఇప్పుడు అందరి కళ్లు బుల్లెట్ రైళ్లపైనే ఉన్నాయి. టెండర్లు పిలవడం, భూసేకరణ వంటి ప్రక్రియలు సజావుగా సాగితే, మన దేశంలో కూడా 300-350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవు.