ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో ఆదివారం ఉదయం తీవ్ర కలకలం నెలకొంది. భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని తక్షణమే లక్నో విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేయించారు. ఈ ఘటన సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 238 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలతో వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాల్లోకి వెళితే, ఇండిగో విమానం 6E-6650 ఆదివారం ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాగ్డోగ్రాకు బయలుదేరింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌లోని ఒక టిష్యూ పేపర్‌పై చేతితో రాసిన బెదిరింపు నోట్‌ను విమాన సిబ్బంది గుర్తించారు. అందులో విమానంలో బాంబు ఉందని పేర్కొనడంతో సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. పైలట్ ఉదయం 8:46 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను అప్రమత్తం చేశారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన అధికారులు సమీపంలోని లక్నో విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాలని ఆదేశించారు.
అధికారుల ఆదేశాల మేరకు విమానం ఉదయం 9:17 గంటలకు లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులందరినీ ఎలాంటి అవాంతరం లేకుండా కిందకు దింపి భద్రత కల్పించారు. సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు ప్రారంభించాయి. విమానం లోపల, ప్రయాణికుల సామగ్రి, కార్గో విభాగాలను జాగ్రత్తగా పరిశీలించారు. ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారికంగా స్పందించింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొంది. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని వెల్లడించింది. లక్నో విమానాశ్రయంలో ప్రయాణికులకు తాత్కాలికంగా ఆహారం, విశ్రాంతి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది. మరోవైపు, ఈ బెదిరింపు వెనుక ఎవరు ఉన్నారు? ఇది నకిలీ బెదిరింపా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల వరుసగా విమానాలకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.