ఇప్పటి రోజుల్లో స్మార్ట్ టీవీ లేని ఇల్లు చాలా అరుదు అని చెప్పుకోవాలి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలు, గేమ్స్ అన్నీ ఒకే స్క్రీన్‌పై చూసే అలవాటు పెరిగిపోయింది. కానీ కొన్నేళ్లు వాడిన తర్వాత చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే టీవీ నెమ్మదిగా పనిచేయడం. యాప్ ఓపెన్ కావడానికి టైమ్ తీసుకోవడం, వీడియోలు మధ్యలో ఆగిపోవడం, రిమోట్ ఇచ్చిన ఆదేశానికి స్పందించకపోవడం లాంటి ఇబ్బందులు తరచూ ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త టీవీ కొనాలా అనే ఆలోచన వస్తుంది. కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. అసలు కొత్త టీవీ అవసరమా? లేకుండా పాత టీవీనే కొంచెం మెరుగ్గా పనిచేయించే మార్గాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి.
స్మార్ట్ టీవీ స్లో అవ్వడానికి చాలా సందర్భాల్లో హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ కారణాలే ఎక్కువగా ఉంటాయి. మొదటగా టీవీలో ఉన్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను చెక్ చేయాలి. చాలా మంది ఈ విషయం పట్టించుకోరు. కానీ కంపెనీలు విడుదల చేసే అప్‌డేట్స్‌లో చిన్న చిన్న బగ్స్‌ను సరిచేయడం, పనితీరును మెరుగుపరచడం జరుగుతుంది. టీవీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్‌డేట్ ఉందో లేదో చూడాలి. కొన్ని పాత మోడల్స్‌కు ఆటోమేటిక్ అప్‌డేట్స్ రాకపోయినా, కంపెనీ వెబ్‌సైట్‌లో మాన్యువల్ అప్‌డేట్స్ అందుబాటులో ఉండొచ్చు. యూఎస్‌బీ డ్రైవ్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తే కొన్నిసార్లు టీవీ వేగం గణనీయంగా మెరుగవుతుంది.
ఇంకో ముఖ్యమైన విషయం పవర్ సేవింగ్ సెట్టింగ్స్. విద్యుత్ ఆదా కోసం టీవీల్లో పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసి ఉంటారు. ఇది స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడమే కాకుండా, టీవీ ప్రాసెసింగ్ పవర్‌ను కూడా కొంతవరకు పరిమితం చేస్తుంది. దాంతో మెనూలు నెమ్మదిగా ఓపెన్ అవుతాయి, యాప్‌లు ఆలస్యంగా స్పందిస్తాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి పవర్ సేవింగ్ లేదా ఎకో మోడ్ ఆఫ్ చేస్తే టీవీ పనితీరులో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ టీవీల్లో స్టోరేజ్ చాలా పరిమితంగా ఉంటుంది. మనం అవసరం లేకుండా ఎన్నో యాప్‌లు ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటాం. ఒకసారి డౌన్‌లోడ్ చేసి మళ్లీ తెరవని యాప్‌లు కూడా స్టోరేజ్‌ను ఆక్రమిస్తాయి. దాంతో టీవీ నెమ్మదిస్తుంది. కాబట్టి తరచూ యాప్ లిస్ట్ చెక్ చేసి, అవసరం లేని యాప్‌లను డిలీట్ చేయడం మంచిది. అలాగే కొన్ని యాప్‌లు క్యాష్ మెమరీని ఎక్కువగా వాడతాయి. స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు క్యాష్ క్లియర్ చేయడం కూడా ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి క్యాష్ క్లియర్ చేస్తే యాప్ మళ్లీ డేటా లోడ్ చేసుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
చాలా సార్లు సమస్య టీవీలో కాకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌లోనే ఉంటుంది. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే వీడియోలు బఫర్ అవుతాయి, యాప్‌లు సరిగా లోడ్ కావు. వైఫై రౌటర్ టీవీకి చాలా దూరంగా ఉంటే సిగ్నల్ బలహీనంగా మారుతుంది. వీలైతే టీవీని నేరుగా ఈథర్నెట్ కేబుల్ ద్వారా రౌటర్‌కు కనెక్ట్ చేయడం మంచిది. ఇలా చేస్తే కనెక్షన్ స్టేబుల్‌గా ఉండి, స్ట్రీమింగ్ అనుభవం మెరుగవుతుంది. ఇంట్లో ఒకేసారి చాలా డివైసులు ఒకే నెట్‌వర్క్ వాడుతున్నా టీవీ పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది.