Tirupati News: తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ పరువు తీసేలా ప్రవర్తించే వారిని ఉపేక్షించబోమని, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీని నష్టపరిచే వ్యక్తులను మోయాల్సిన అవసరం తమకు లేదని బాబు తేల్చిచెప్పారు.
గత ఎన్నికల్లో యువతకు, కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే పుట్టా మహేష్‌కు ఎంపీ సీటు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. చట్టసభలకు వెళ్లి ప్రజల కోసం పనిచేస్తారని నమ్మి అవకాశం కల్పిస్తే, కొందరు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారే ఇలాంటి తప్పులకు పాల్పడటం దురదృష్టకరమని, ఇది పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ గౌరవాన్ని దెబ్బతీసేలా పుట్టా మహేష్ ప్రవర్తించడంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎంపీ హోదాలో ఉండి ఇతర పార్టీల వైపు చూడటం లేదా అనైతిక సంబంధాలు పెట్టుకోవడం వంటివి పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని మండిపడ్డారు. దశాబ్దాల కాలంగా కార్యకర్తల కష్టంతో, ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కొందరు తమ స్వార్థం కోసం, దురలవాట్ల కోసం కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తప్పు చేసే వారికి పార్టీలో స్థానం లేదని కుండబద్దలు కొట్టారు.
రాజకీయాల్లో రాణించాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదని, వ్యక్తిగత క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, సొంత అజెండాలతో పార్టీకి నష్టం కలిగించే వారిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై యాక్షన్ తీసుకోవడానికి వెనకాడబోమని, ఇప్పటికే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మొత్తానికి పుట్టా మహేష్ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న స్టాండ్ చూస్తుంటే, త్వరలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండబోతున్నాయని అర్థమవుతోంది. తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని చెప్పడం ద్వారా పార్టీలోని ఇతర నేతలకు కూడా బాబు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేల సాక్షిగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.