సరిహద్దు ఉద్రిక్తతలు నెలలుగా చెలరేగుతున్న పాక్–అఫ్గాన్ దేశాల మధ్య శాంతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన చర్చలు ఇరుదేశాల మధ్య కొత్త పరిణామానికి దారి తీసాయి. ఖతార్ మరియు తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చల్లో ఇరుపక్షాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఇరుదేశాల ప్రతినిధలు సమావేశమై సరిహద్దు భద్రత ఉగ్రవాద నిర్మూలన వాణిజ్య మార్గాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. కాల్పుల విరమణ అమలు కోసం పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. భవిష్యత్‌లో ఈ ఒప్పందం కొనసాగింపుపై మరో దఫా సమావేశాలు జరగనున్నాయని ఖతార్ అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ చర్చల ప్రాధాన్యం మరింతగా పెరగడానికి కారణం – అవి వైమానిక దాడుల తర్వాత జరగడం. చర్చల కంటే ఒక రోజు ముందు పాక్ వైమానిక దళం అఫ్గాన్‌లోని పాక్టికా ప్రాంతంపై దాడులు జరిపింది. ఈ ఘటనలో పౌరులు మృతిచెందినట్టు అఫ్గాన్ అధికారులు ఆరోపించగా పాక్ భద్రతా వర్గాలు మాత్రం తమ లక్ష్యం ఉగ్రవాద శిబిరాలని వివరణ ఇచ్చాయి. ఇలాంటి దాడులు ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
దోహా చర్చల్లో ఇరుదేశాల రక్షణ మంత్రులు భద్రతా సలహాదారులు పాల్గొనడం దౌత్యపరంగా విశేషం. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు గమనీకులుగా హాజరయ్యారు. సరిహద్దు దాడులు, పరస్పర ఆరోపణలతో నెలలుగా సాగిన ఉద్రిక్తతల్లో ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఖతార్, తుర్కియే దౌత్యపరమైన చొరవ ఇరుదేశాల మధ్య సంభాషణ వేదికను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రాంతీయ స్థాయిలో శాంతి స్థిరత్వం కోసం ఈ ఒప్పందం కీలక అడుగుగా అభివర్ణించబడుతోంది. ఇటీవల తాలిబాన్ యోధులు, పాక్ సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఇరుపక్షాలకూ ఉపశమనం కలిగించనుంది. అమెరికా, చైనా, రష్యా, ఐక్యరాజ్యసమితి వంటి దేశాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ దక్షిణాసియాలో శాంతికి ఇది సానుకూల సంకేతమని పేర్కొన్నాయి