క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ఐపీఎల్ (IPL) 2026 సీజన్ షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సాధారణంగా ఈ సమయానికి షెడ్యూల్ పక్కాగా సిద్ధం కావాల్సి ఉన్నా, ఈసారి మాత్రం బీసీసీఐ (BCCI) కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వస్తోంది. అటు దేశ రాజకీయాలు, ఇటు ఫ్రాంచైజీల అంతర్గత సమస్యలు ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీగా పోలీసు భద్రత అవసరం. అదే సమయంలో ఎన్నికల పోలింగ్ కూడా ఉంటే భద్రతా సిబ్బందిని కేటాయించడం కష్టమవుతుంది. ఎన్నికల తేదీలు వెల్లడైన తర్వాత, పోలింగ్ రోజున ఆయా నగరాల్లో మ్యాచ్‌లు లేకుండా ప్లాన్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. "ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే, దానికి ఇబ్బంది లేకుండా క్రికెట్ షెడ్యూల్ రూపొందిస్తాం" అని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఇది మింగుడుపడని వార్తే. గత ఏడాది (2025) ఐపీఎల్ వేడుకల సమయంలో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన తర్వాత అక్కడ భద్రతపై అనేక ఆంక్షలు విధించారు. షరతులతో కూడిన అనుమతులు వచ్చినా, పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు నిర్వహించగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆర్‌సీబీ తమ కొన్ని హోమ్ మ్యాచ్‌లను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు తరలించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఫ్రాంచైజీ వారం రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA)లో నడుస్తున్న పరిపాలనాపరమైన చిక్కులు, రాజకీయ వివాదాల వల్ల జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం లభ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
స్టేడియం సమస్యలు సర్దుమణగకపోతే పుణేను హోమ్ గ్రౌండ్‌గా సిద్ధం చేసుకోవాలని రాజస్థాన్ ఫ్రాంచైజీకి బీసీసీఐ ఇప్పటికే సూచించింది. సొంత గడ్డపై ఆడే అవకాశం కోల్పోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ లోటుగా మారవచ్చు.
ఐపీఎల్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు మరికొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు. ఎన్నికల తేదీలు ఖరారై, ఆర్‌సీబీ, ఆర్‌ఆర్ ఫ్రాంచైజీలు తమ హోమ్ గ్రౌండ్స్‌పై స్పష్టత ఇస్తే తప్ప పూర్తి షెడ్యూల్ విడుదల కాదు. ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటి వారంలోగా ఐపీఎల్ 2026 సంపూర్ణ చిత్రపటంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.