వాంబే కాలనీలో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్..
శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ..
విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు కేటాయించి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, వాంబే కాలనీలో ఇలాంటి సదుపాయం చాలా అవసరమని, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానికులకు సమావేశాలు, వేడుకలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఇలాంటి సౌకర్యం రావడం వల్ల సామాజిక కార్యకలాపాలు మరింత సులభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు అధికారులకు సూచించారు.