Dacoit Movie Review:నటుడు అడివి శేష్ అంటేనే టాలీవుడ్లో ఒక బ్రాండ్. ఆయన కథలు ఎప్పుడూ కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. 'మేజర్' లాంటి భారీ విజయం తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని అడివి శేష్ చేసిన సినిమా 'డెకాయిట్ ఒక ప్రేమ కథ'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? శేష్ ఖాతాలో మరో హిట్ పడిందా అనేది ఇప్పుడు చూద్దాం..
ఈ కథ అంతా హరి (అడివి శేష్), సరస్వతి (మృణాల్ ఠాకూర్) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. హరి తక్కువ కులానికి చెందినవాడు, సరస్వతి అగ్ర వర్ణానికి చెందిన అమ్మాయి. వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ ఊహించని విధంగా ఒక మర్డర్ కేసులో హరి అరెస్ట్ అవుతాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. తన ప్రాణంగా ప్రేమించిన సరస్వతి సాక్ష్యం చెప్పడం వల్లే హరికి జైలు శిక్ష పడుతుంది. జైలు నుంచి బయటకు వచ్చాక తనను మోసం చేసిన ప్రియురాలిపై హరి ఎలా పగ తీర్చుకున్నాడు? అసలు సరస్వతి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వారి ప్రేమ కథ చివరకు ఏ తీరానికి చేరింది అనేది మిగిలిన సినిమా.
అడివి శేష్ సినిమాల్లో సాధారణంగా ఉండే 'వేగం' ఈ సినిమాలో కొంచెం తగ్గింది. ఫస్టాఫ్ అంతా దర్శకుడు పాత్రలను పరిచయం చేయడం, వారి మధ్య ప్రేమను చూపించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి అర గంట కథనం చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. శేష్ స్వయంగా ఈ కథకు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అయితే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. పాత కాలం నాటి రివెంజ్ డ్రామా కథలా అనిపించినా, మేకింగ్ పరంగా దర్శకుడు షానియల్ డియో కొత్తదనం చూపించాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్లు గుండెకు హత్తుకుంటాయి.
అడివి శేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. యాక్షన్ సీన్లలో ఆయన నటన మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఇక మృణాల్ ఠాకూర్ గురించి చెప్పక్కర్లేదు. 'సీతారామం' తర్వాత ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలో కూడా ఆమె తన నటనతో, కళ్లతోనే హావభావాలను పలికించి మెప్పించింది. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి దిగ్గజ నటులు ఉన్నప్పటికీ, వారికి మరిన్ని పవర్ ఫుల్ సీన్లు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతలో వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అతి పెద్ద బలం. పాటలు సోసోగా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ప్రతి సన్నివేశాన్ని తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది, విజువల్స్ గ్రాండ్‌గా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు.
మొత్తంగా చెప్పాలంటే, 'డెకాయిట్' ఒక విభిన్నమైన ప్రేమ కథ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా కొంచెం క్లాస్, కొంచెం మాస్ టచ్‌తో సాగుతుంది. లాజిక్కుల కంటే ఎమోషన్స్‌ను నమ్ముకుని తీసిన సినిమా ఇది. శేష్ నుంచి వచ్చే ఫాస్ట్ పేస్ థ్రిల్లర్స్ ఆశించి వెళ్తే కొంచెం నిరాశ పడొచ్చు కానీ, ఒక మంచి యాక్షన్ లవ్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.