రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు అభివృద్ధిపై స్పీడ్ పెంచిన ప్రభుత్వం..
డ్రెడ్జింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు..
రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో పోర్టు పనుల పురోగతి, మౌలిక సదుపాయాలపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు.
పోర్టు నిర్మాణంలో భాగంగా డ్రెడ్జింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతర్గత నిర్మాణ పనులు కూడా సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పోర్టు నుంచి సరుకు రవాణాను వేగవంతం చేయడం కోసం ఔటర్ రోడ్లు మరియు రైల్వే కనెక్టివిటీ అభివృద్ధిపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సులభతరం అవుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి భారీగా అభివృద్ధి జరుగుతుందని మంత్రుల బృందం పేర్కొంది. వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు.
రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరవనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.