సూపర్ సిక్స్, యువత ప్రోత్సాహంపై మహానాడులో చర్చ..
అభివృద్ధి, ప్రతిపక్షాల వ్యవహారశైలిపై మహానాడులో తీర్మానాలు..
టీడీపీ వార్షిక మహాసభ అయిన మహానాడుకు పార్టీ నేతలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. ఈసారి రెండు రోజుల పాటు జరిగే మహానాడులో దాదాపు 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టాలని పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన కమిటీ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
మహానాడులో పార్టీ భావజాలం, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా తీర్మానాలు తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు మరింత ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలపై ఉమ్మడి తీర్మానాలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రానికి లభిస్తున్న సహకారం వంటి అంశాలపై కూడా మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా పడుతోందన్న దానిపైనా తీర్మానం తీసుకురావాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది.
ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల విధ్వంసక రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్న తీరు వంటి అంశాలపై కూడా మహానాడులో చర్చ జరగనుంది. చివరగా పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని ప్రతిబింబించేలా కీలక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు తీసుకురావాలని కూడా సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. మహానాడు తీర్మానాల కమిటీ రేపు మరోసారి సమావేశమై తుది రూపు ఇవ్వనుంది. అనంతరం తీర్మానాల అంశాలను పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అధిష్ఠానానికి సమర్పించనున్నారు.
ఈసారి మహానాడు ద్వారా పార్టీ భవిష్యత్ దిశ, ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలపై స్పష్టమైన సందేశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.