కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ సందడి మొదలైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ (TDP) కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి, రాష్ట్ర రాజధాని అమరావతికి పూర్తిస్థాయి చట్టపరమైన హోదా కల్పించేలా పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్రాన్ని కోరారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏపీ ప్రయోజనాలతో పాటు జాతీయ స్థాయి సమస్యలపై కూడా చర్చించాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది. సమావేశం అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష భేటీ వివరాలను వెల్లడించారు.
రాజధాని అమరావతికి రక్షణ కవచం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రాజధాని నిర్మాణం. అమరావతికి కేవలం ప్రకటనల ద్వారా కాకుండా చట్టపరమైన భరోసా ఉండాలని టీడీపీ స్పష్టం చేసింది. అమరావతికి చట్టబద్ధమైన హోదా ఇవ్వాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని నిర్మాణానికి ఆటంకం కలగదు. దీనిపై కేంద్రం తక్షణమే బిల్లు తీసుకురావాలి అని లావు పేర్కొన్నారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుతో పాటు, రాజధాని అభివృద్ధికి అవసరమైన మద్దతును చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అంశాలతో పాటు మూడు ప్రధాన జాతీయ అంశాలను పార్లమెంటులో చర్చకు పెట్టాలని టీడీపీ సూచించింది
ఎఫ్టీఏల సమీక్ష: భారత్-యూరోపియన్ యూనియన్ (EU) సహా ఇతర దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) వల్ల కలిగే లాభనష్టాలపై సమగ్ర చర్చ జరగాలి.
సోషల్ మీడియాపై నియంత్రణ: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాదిరిగా భారత్ కూడా కఠినమైన నిషేధ చట్టాన్ని తీసుకురావాలి.
ప్రజాప్రతినిధుల అనర్హత: ప్రధాని, ముఖ్యమంత్రులు సహా ఎవరైనా ప్రజాప్రతినిధులు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవిస్తే, వారి పదవిని కోల్పోయేలా చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను అధిగమించేందుకు నదుల అనుసంధాన ప్రక్రియకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి ప్యాకేజీల పైనా టీడీపీ దృష్టి పెట్టనుంది..