ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం మరోసారి మెగా పీటీఎం (పేరెంట్–టీచర్ మీటింగ్) నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశాలను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, వృత్తి విద్య రంగాలపై ఆయన సమీక్ష జరిపి, ప్రతి స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంపొందించే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కోసం ఒకే విధమైన చట్టం (Unified Act) రూపొందించాలన్న నిర్ణయం కూడా ఆయన ప్రకటించారు. విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేసి, విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి అవకాశాలను పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియలో కూడా ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ముఖ గుర్తింపు వ్యవస్థ (Face Recognition System) ద్వారా హాజరు నమోదు చేయాలని సూచించారు. దీని వల్ల హాజరు పర్యవేక్షణలో పారదర్శకత పెరగడం, విద్యార్థుల తరగతి హాజరు శాతం మెరుగుపడడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. వర్సిటీలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు 100 శాతం జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థానాలు సాధించేందుకు కృషి చేయాలని లోకేశ్ ఆదేశించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లోకేశ్ అన్నారు. ఐటీఐలు, యూనివర్సిటీలను పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి వివరించారు. వృత్తి విద్య కోర్సుల్లో ఉన్న విద్యార్థుల పురోగతిని తెలుసుకునేందుకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడంలో నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 406 జాబ్ మేళాల ద్వారా 78 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని ఆయన తెలిపారు. విద్య, పరిశ్రమల మద్య బంధం బలోపేతం చేయడం ద్వారా మరింత ఉద్యోగావకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం కొత్త అడుగు వేసింది. ఈ నెల 27 నుండి డిసెంబర్ 2 వరకు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వారు అక్కడి పాఠశాలలు, బోధనా పద్ధతులు, తరగతి గది వాతావరణం, విద్యార్థి-గురువు పరస్పర సంబంధాలపై అధ్యయనం చేస్తారు. ఈ పర్యటన అనంతరం వారు సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు చేపడతామని లోకేశ్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా పద్ధతులను అవలంబించడం ద్వారా ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడగలరని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.