అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు..
అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ?.. ప్రజల ముందే తేల్చుకుందామన్న నేతలు..
పల్నాడు: పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయంగా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
నరసరావుపేట అభివృద్ధి, ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ విసిరారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల ముందే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే సవాల్‌కు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. తాను కూడా పూర్తి ఆధారాలు, వివరాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కోటప్పకొండలోనే ప్రజల సమక్షంలో చర్చ నిర్వహిద్దామని ఆయన సూచించారు.
ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో నరసరావుపేటలో రాజకీయ చర్చలు మరింత ఊపందుకున్నాయి. స్థానికంగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారగా, ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నారు.
నేతల సవాళ్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట, కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అయితే బహిరంగ చర్చలు లేదా సభలు నిర్వహించేందుకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
ఇద్దరు ప్రముఖ నాయకుల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ సవాళ్లు పల్నాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుండగా, రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.