బీసీ వర్గాలకు రాజకీయంగా అండగా నిలిచే పార్టీగా టీడీపీ నిలుస్తోంది..
టీడీపీలో కార్యకర్తే అధినేతలు..
అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
బీసీ వర్గాలకు రాజకీయంగా అండగా నిలిచే పార్టీగా టీడీపీ నిలుస్తోందని పల్లా పేర్కొన్నారు. ఒక బీసీ నాయకుడిగా తనకు ఈ స్థాయి గుర్తింపు రావడం, చంద్రబాబు దూరదృష్టి, బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.
పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ కు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ నాయకత్వం పార్టీకి కొత్త దిశ చూపుతుందని, ఆయన పనితీరు టీడీపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పార్టీ క్షేత్ర స్థాయిని బలోపేతం చేయడంతో పాటు యువతను ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
“టీడీపీలో కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతాన్ని మరోసారి గుర్తు చేస్తూ, సామాన్య కార్యకర్తలకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని పల్లా పేర్కొన్నారు. మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలకు కూడా అత్యున్నత కమిటీ అయిన పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం విశేషమని తెలిపారు.
జాతీయ, రాష్ట్ర కమిటీల్లో కొత్తగా నియమితులైన సభ్యులకు పల్లా శ్రీనివాసరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వారి కృషి, నిబద్ధతకు గుర్తింపుగానే ఈ బాధ్యతలు లభించాయని చెప్పారు. వారి నాయకత్వంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరుతాయని, పార్టీ అన్ని స్థాయిల్లో బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూ, యువతకు అవకాశాలు కల్పిస్తూ పార్టీని భవిష్యత్ తరాలకు మరింత బలంగా తీర్చిదిద్దుతామని పల్లా స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ మార్పులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాయకత్వంపై విశ్వాసంతో, క్షేత్ర స్థాయిలో మరింత శక్తివంతంగా పార్టీ ముందుకు సాగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.