పోర్టు కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా మంత్రి సూచనలు..
యువతకు ఉపాధి అవకాశాలు..
నెల్లూరు: పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ను సందర్శించారు. పోర్టు కార్యకలాపాలను స్వయంగా పరిశీలిస్తూ, అభివృద్ధి అవకాశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలతో పాటు సీఈ రాఘవరావు, పోర్టు ప్రతినిధులు పాల్గొన్నారు.
పోర్టు పరిధిలోని వివిధ ప్రాంతాలను మంత్రి నౌకలో ప్రయాణిస్తూ ప్రత్యక్షంగా పరిశీలించారు. పోర్టు నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలు, సరుకు రవాణా విధానం వంటి అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా మంత్రి సూచనలు చేశారు. ముఖ్యంగా కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు.
ఎగుమతి – దిగుమతి సామర్థ్యాన్ని పెంచేలా పోర్టు విస్తరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పోర్టును అభివృద్ధి చేయాలంటే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోర్టు అభివృద్ధి చెందితే స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలు పెరగడం ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని తెలిపారు.
కృష్ణపట్నం పోర్ట్‌ను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇచ్చిన సూచనలతో పోర్టు అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.