విశాఖపట్నంలో ఈనెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్-2026 జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో విశాఖపట్నం తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్(విఎస్ఎం), ఇతర నౌకాదళ అధికారులు సమావేశమై చర్చించారు.ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(IFR)లో దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున నౌకలు,ఎయిర్ క్రాప్ట్ లు పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారని ఆయన సిఎస్ కు వివరించారు.
ముఖ్యంగా శ్రీలంక,ఇరాన్ తదితర 19 దేశాలకు చెందిన నౌకలు,సుమారు 4వేల మంది వరకూ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.అలాగే అమెరికా,జర్మనీ,ఫ్రాన్స్ దేశాలకు చెందిన మూడు నౌకలు150 మంది వరకూ ప్రతినిధులు పాల్గోనున్నారని చెప్పారు.అదే విధంగా మన దేశానికి సంబంధించి 90 నౌకలు,45 ఎయిర్ క్రాప్ట్ లు,సుమారు 600 మంది ప్రతినిధులు పాల్గోనున్నారని చెప్పారు.ఈనెల 18న విశాఖపట్నం సముద్రతీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ,19న సిటీ పరేడ్ ఉంటాయన్నారు.
ఈఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపతిముర్ము,రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హజరవుతారని, మిలాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు తదితర ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ విశాఖలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుందని తూర్పు నౌకాదళ అధికారులకు చెప్పారు.
ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమానికి రాష్ట్రపతి,రక్షణ మంత్రి,గవర్నర్,ముఖ్యమంత్రి వంటి వివిఐపిలు హాజరు అవుతున్న నేపధ్యంలో అందుకు అనుగుణంగా తగిన బందోబస్తు ఇతర ఏర్పాట్లను చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ అంటే: భారత రాష్ట్రపతి తన హయాంలో నౌకాదళ సామర్థ్యాన్ని ఒకసారి సమీక్షిస్తార దానినే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే దేశ నౌకాదళం తోపాటు పొరుగు దేశాలకు చెందిన నౌకలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన నౌకల సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షిస్తారు.ఈ కార్యక్రమంలో కీలకమైన యుద్ధనౌకలు,సబ్‌మెరైన్లు పాల్గొంటాయి.
మిలాన్ అంటే:వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు ప్రదర్శనలో పాల్గొంటాయి. సముద్ర కార్యకలాపాల్లో పరస్పర సహకారం,సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించి నిర్వహించే కార్యక్రమమే మిలాన్.ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా టిఆర్అండ్బి స్పెషల్ సిఎస్ కృష్ణబాబు,ఐజి ఆపరేషన్స్ సిహెచ్ శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.