political: శృంగేరి పీఠం సూచనలతో ఆలయ నిర్మాణం
నది మధ్యలో 100 అడుగుల శివయ్య
మత సామరస్యానికి ప్రతీకగా మూసీ తీరం
Musi Riverfront Development: తెలంగాణ గుండెకాయ లాంటి మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ నదిని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా, ఆధ్యాత్మిక కేంద్రంగా మత సామరస్యానికి వేదికగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ప్రతిష్టాత్మకమైన 'ఓంకారేశ్వర మందిర' నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆలయ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.
మంచిరేవులలో ఇప్పటికే 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయాలు ఉన్నాయి. వీటికి సమీపంలోనే సుమారు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్తగా ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయ డిజైన్ నిర్మాణ శైలిని కర్ణాటకలోని ప్రముఖ శృంగేరి శారదా పీఠం జగద్గురువుల సూచనల మేరకు ఖరారు చేశారు. 64 అడుగుల ఎత్తుతో గర్భాలయ గోపురం, విశాలమైన మండపాలు, ఎత్తైన గాలి గోపురంతో ఈ క్షేత్రం చూపరులను ఆకట్టుకోనుంది.
ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ మూసీ నది మధ్యలో ఏర్పాటు చేయనున్న 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం. నదిపై ఒక చిన్నపాటి ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేసి, ఆ నీటి మధ్యలో శివుడు కొలువుదీరినట్లుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీని చుట్టూ అందమైన పార్కులు, బోటింగ్ సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ఈ ఆలయానికి నేరుగా విశాలమైన రహదారులను కూడా నిర్మించనున్నారు.
ప్రభుత్వం కేవలం ఆలయాలనే కాకుండా, మూసీ పరివాహక ప్రాంతాన్ని అన్ని మతాల కలయికగా మార్చాలని భావిస్తోంది. దీనికోసం పురానాపూల్ వద్ద భారీ మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్ ప్రాంతంలో చర్చి నిర్మాణాలను కూడా చేపట్టబోతున్నారు. లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా.. తొలిదశ పనులను ఈ ఓంకారేశ్వరాలయ శంకుస్థాపనతోనే ప్రారంభించనున్నారు. 2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం ఇప్పటికే రూ. 1500 కోట్లు కేటాయించడం విశేషం.
బాపూఘాట్ వద్ద నిర్మించనున్న గాంధీ సరోవర్, 150 మీటర్ల ఎత్తున్న మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు ఈ ఓంకారేశ్వర ఆలయం కూడా తోడైతే, హైదరాబాద్ పర్యాటక రంగం మరో స్థాయికి చేరుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుండి నిధులే కాకుండా, ప్రముఖ దాతలు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోనున్నారు. రాబోయే రోజుల్లో మూసీ ఒడ్డున ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.