అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేనివారిని పట్టించుకోము..
సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి..
ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని వారిని పట్టించుకోము” అంటూ స్పష్టం చేసిన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలపై విమర్శించారు. “జగన్ రాజకీయాలు చేయాలనుకుంటే ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలి. సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి” అని అన్నారు.
ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు. “వారికి ఒక్క అవకాశం దొరికితే కబ్జాలు చేసి, ప్రజల ఆస్తులను లాక్కొని ఎవరూ బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖ వాసుల మంచితనాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారు” అని తీవ్రంగా ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వివరించారు. “విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ రాష్ట్రానికి వచ్చింది” అని చెప్పారు.
ఇంకా ఆర్సిలర్ మిట్టల్ సహా పలు పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ ప్రాంతం త్వరలోనే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల సహకారంతో మరింత పురోగతి సాధిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.