నేడు పశ్చిమబెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం..
ఎమ్మెల్యేలు - బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై నేడు కోల్‍కతా వెళ్లనున్న అమిత్‍షా..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలక ముందడుగు పడనుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాకు వెళ్లనున్నారు. అక్కడ కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఇదే సమయంలో గవర్నర్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ అసెంబ్లీని రద్దు చేయడం గమనార్హం.
రేపటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో సీఎం పదవిపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సువెందు అధికారి సహా ఐదుగురు నేతలు సీఎం రేసులో ఉన్నారని సమాచారం. అయితే పార్టీ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇక రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, అలాగే ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. పశ్చిమబెంగాల్ రాజకీయాలు క్షణక్షణం మారుతున్న వేళ, కొత్త సీఎం ఎవరనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.