బిహార్‌లో ఈసారి ఎన్నికలు పురుషులను మించి మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో రావడంతో ఎన్డీఏకి అనూహ్య మెజారిటీని వచ్చిందని చెప్పుకోవాలి. బిహార్‌లో మొదటిసారిగా మహిళల ఓటింగ్ శాతం 71.6 శాతానికి చేరడం రాజకీయంగా కీలక సంకేతం. పురుషులు 62.8 శాతం మాత్రమే ఓటు వేయడం జరిగినది బీహార్ లో మహిళల నిర్ణయమే ఈ ఎన్నికల దిశను నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.
జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు మహిళలలో పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆయన 20 ఏళ్ల పాలనంతా మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి పెరిగిందని చెప్పుకోవాలి. మొదటి టర్మ్‌లో ఇచ్చిన సైకిల్ పథకం వేలాది బాలికల విద్యాభ్యాసాన్ని ముందుకు నడిపింది. తరువాత జీవలికా వంటి స్వయం సహాయక సంఘాల విస్తరణ, పంచాయతీలు–పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళల రిజర్వేషన్ వంటి నిర్ణయాలు వీరి నమ్మకాన్ని మరింత పెంచాయి.
ఈసారి ఎన్నికల ముందు తీసుకున్న అత్యంత ప్రభావం చూపిన నిర్ణయం ప్రతి మహిళకు వ్యాపారం ప్రారంభించడానికి ఇచ్చిన రూ.10,000 ఆర్థిక సహాయం. ఇప్పటికే 1.21 కోట్లు పైగా మహిళలకు ఈ మొత్తం నేరుగా ఖాతాల్లో జమ కావడంతో ఇది వాగ్దానం కాదు, అమలు అనే భావన బలపడింది. ప్రతిపక్షమైన మహాగఠ్‌బంధన్ కూడా వివిధ హామీలు ఇచ్చినా అమలు విషయంలో నమ్మకం మీరలేదని మహిళల తీరు సూచించింది.
2016లో అమలైన మద్య నిషేధంతో మహిళలలో నితీశ్‌కు ఏర్పడ్డ మద్దతు అంతకంతకూ పెరిగింది. ఇంటి శాంతి, పురుషుల మద్యం అలవాట్ల తగ్గుదల వంటి అంశాలు మహిళల అభిప్రాయాన్ని మరింత బలంగా మార్చాయి. మరోవైపు ఆర్‌జేడీ పాలనలో చోటుచేసుకున్న చట్ట–భద్రతా లోపాలు “జంగిల్‌రాజ్’’గా ప్రచారానికి రావడమూ మహిళల మద్దతు ఎన్డీఏ వైపు మరింతగా మళ్ళించింది. ప్రధాని మోదీ కూడా ప్రతి సభలో ఈ అంశాన్ని బలంగా ఎత్తిచూపడం గమనార్హం.
ప్రశాంత్ కిశోర్ మరియు తేజస్వీ యాదవ్ వంటి నాయకులు మద్య నిషేధం పునర్విమర్శ చేస్తామని చెప్పడం మహిళలను మరింత అసౌకర్యానికి గురి చేసింది. అందుచేత ఈ ఎన్నికల్లో మహిళల ఓటు కేవలం రూ.10,000కు పరిమితం కాలేదు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న నితీశ్ పాలనపై వారి విశ్వాసం మరియు భద్రతా భావమే ఎన్డీఏకి భారీ మెజారిటీని అందించింది.