అమెరికాలో H-1B వీసా విధానంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేస్తోన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన కాంగ్రెస్ సభ్యురాలు మార్జరీ టేలర్ గ్రీన్ తాజాగా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఆమె ప్రవేశపెట్టబోయే బిల్లు పూర్తిగా ఆ వీసా కార్యక్రమాన్ని రద్దు చేయడంపైనే దృష్టిసారించడం వల్ల, లక్షలాది భారతీయ ఐటీ నిపుణులకు ఇది పెద్ద ఆందోళనగా మారింది.
గ్రీన్ మాట్లాడుతూ H-1B వీసా సంవత్సరాలుగా మోసాలు, దుర్వినియోగం, స్థానికులకు ఉద్యోగాల కోత వంటి సమస్యలకు కారణమైందని, అమెరికన్ కార్మికులను తొలగించి విదేశీ ప్రతిభను పెంచినట్లు ఆరోపించారు. ఇకపై అమెరికన్ పౌరులను మొదటి ప్రాధాన్యతగా చూసే సమయం వచ్చిందని వలస కార్మికులపై దేశం ఆధారపడే పరిస్థితిని తొలగించాల్సిందేనని ఆమె వాదించారు. ట్రంప్ ప్రభుత్వం గత నెలల్లో తీసుకున్న కఠిన నిర్ణయాలు, కొత్త ప్రాక్లమేషన్ రూపంలో వచ్చిన 1 లక్ష డాలర్ల అదనపు ఫీజు వంటి చర్యలు ఇప్పటికే ఈ వీసా ద్వారా అమెరికాకు చేరుతున్న నిపుణులకు భారంగా మారాయి.
ఈ బిల్లులో ఒక్క మినహాయింపు మాత్రమే ఉండబోతోందని గ్రీన్ స్పష్టం చేసింది — అత్యవసర వైద్య సేవలు అందించే డాక్టర్లు, నర్సుల కోసం ప్రతి సంవత్సరం 10,000 వీసాలను అనుమతించే అవకాశం. అయితే ఈ సంఖ్య కూడా పదేళ్ల వ్యవధిలో పూర్తిగా నిలిపివేయబడుతుందని పేర్కొనడం గమనార్హం. అమెరికాలో వేలాది స్థానిక వైద్య విద్యార్థులు రెసిడెన్సీ అవకాశాలు దొరకక నిరుత్సాహానికి గురవుతుండగా విదేశీ డాక్టర్లు ఐదు వేల మందికి పైగా అదే అవకాశాలు పొందటం “అమెరికాకు అన్యాయం” అని ఆమె వ్యాఖ్యానించారు.
H-1B వీసా ద్వారా ఎన్నో ఏళ్లుగా వస్తున్న నిపుణులు చివరకు గ్రీన్ కార్డు, తరువాత పౌరసత్వం పొందే మార్గం కలిగి ఉండటం ఈ కార్యక్రమాన్ని అమెరికాలో అత్యంత కీలకంగా నిలబెట్టింది. ముఖ్యంగా భారతీయులు STEM రంగాల్లో ప్రతిభావంతులైనందున మొత్తం మంజూరైన వీసాల్లో 70 శాతం వరకు పొందుతున్నారు. ఈ ప్రతిపాదిత బిల్లు ఆ మార్గాన్నే పూర్తిగా మూసివేయబోతుందని వలస నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత కొద్ది వారాలుగా ట్రంప్ తన వైఖరిని కొంత మారుస్తున్నట్లు కనిపించినప్పటికీ, “కొన్ని రంగాల్లో ప్రతిభావంతులైన విదేశీ నిపుణులు అవసరం” అని చెప్పినప్పటికీ, రిపబ్లికన్ పార్టీలోని కఠిన వలస విధాన వర్గాలు మాత్రం వీసాలపై మరింత కఠిన నిర్ణయాల వైపే నడుస్తున్నాయి.
అమెరికాలో పనిచేస్తున్న వేలాది భారతీయ ఐటీ ఉద్యోగులకు ముఖ్యంగా దీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ ప్రతిపాదన తీవ్ర ఆందోళన కలిగించింది. వీసా గడువు పూర్తయ్యే సరికి దేశం విడిచిపోవాల్సిందేనని బిల్లు చెబుతుండటంతో ఇది వలస కలను పూర్తిగా కూల్చివేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. అమెరికాలో వలసల చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ పోరాటం రాబోయే నెలల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంటుందేమో.