వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి (YSRCP MP Mithun Reddy) అరెస్టుతో గత ఐదేళ్లలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు శాంతించాయని అనంతపురం (Anantapuram) అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
అనంతపురంలోని 18వ డివిజన్ గిల్జారుపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్లలో నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి వైకాపా నాయకులు కారణమయ్యారని అన్నారు.
అందుకే ఇప్పుడు ఒక్కొక్కరిగా అరెస్టవుతున్నారని చెప్పారు. నాసిరకం మద్యం తాగి ఎంతోమంది చనిపోయారని, మహిళల తాళిబొట్లు తెంచిన కర్కశులు వైకాపా నాయకులని అన్నారు. మిథున్రెడ్డి అరెస్టుతో బాధితులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే, అవినీతి సొమ్మును కక్కించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారని, కచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి (MLA Daggubati) స్పష్టం చేశారు.