ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని దేశంలోనే అతి పెద్ద కార్యక్రమంగా నిలిపినట్లు తెలిపారు. నెలకు 64 లక్షల కుటుంబాలకు పెన్షన్లు అందిస్తున్నామని, దీని వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోందని ఆయన వివరించారు.
అలాగే, తల్లికి వందనం పథకం కింద పిల్లలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కోసం అన్నదాతా సుఖీభవ కింద పీఎం కిసాన్‌తో కలిపి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటికే రూ.7 వేల మొదటి విడత నిధులు జమ చేసినట్లు గుర్తు చేశారు.
మహిళల కోసం మరో కీలక పథకం ఆడబిడ్డ నిధి అమలుపై ప్రభుత్వం ముందడుగు వేసిందని చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నేరుగా అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. ఈ చర్యతో కుటుంబాల్లో మహిళల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాక, వృత్తి ఆధారిత సమాజాలకు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రజకులకు ఆధునిక ధోబీ ఘాట్లు, ఇస్త్రీ షెడ్లు, సౌర శక్తితో నడిచే బండ్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలను అందిస్తామని చెప్పారు. వడ్డెరలకు క్వారీల్లో రిజర్వేషన్లు, చర్చిల నిర్మాణం, మసీదుల నిర్వహణ, జెరూసలేం యాత్రికులకు సాయం వంటి పథకాలు కూడా అమలు చేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు, గిరిజనులకు న్యాయం, మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళాలు, యూనివర్సల్ హెల్త్ కార్డులు, శాశ్వత కుల ధ్రువపత్రాలు వంటి చర్యలు త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఈ ప్రకటనలతో ప్రజల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.