US Embassy Venezuela: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా రాయబార కార్యాలయం తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించింది. గతంలో నెలకొన్న తీవ్ర రాజకీయ ఉత్కంఠ, దౌత్యపరమైన విభేదాల వల్ల 2019లో మూతపడ్డ ఈ ఎంబసీని సోమవారం అధికారికంగా తెరిచినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వెనిజులాలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో పాటు స్థిరత్వం వస్తోందని ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా విదేశాంగ విధానంలో ఇదొక కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కరాకస్‌లో రాయబార కార్యాలయం పునఃప్రారంభం కావడం వల్ల అక్కడి తాత్కాలిక ప్రభుత్వం, పౌర సమాజం ప్రైవేట్ రంగంతో నేరుగా చర్చలు జరిపే అవకాశం కలుగుతుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. గతంలో నికోలస్ మదురో పాలనపై అసంతృప్తితో అమెరికా తన దౌత్య సంబంధాలను తెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కార్యకలాపాలు మొదలవ్వడం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపినట్లయింది.
ఈ పరిణామంపై మార్కో రూబియో స్పందిస్తూ.. వెనిజులాలో వ్యాపారాలు మళ్లీ పుంజుకోవడానికి అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. అయితే, దేశం పూర్తి ఆర్థిక సామర్థ్యాన్ని చేరుకోవాలంటే అక్కడ పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాత్కాలిక యంత్రాంగంతో పని చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వం రావాలని అమెరికా కోరుకుంటోంది.
వాస్తవానికి, 2019లో వెనిజులాలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అప్పటి అధ్యక్షుడు మదురోను అమెరికా గుర్తించలేదు. ఆ సమయంలోనే తమ ఎంబసీని మూసివేసి, పొరుగు దేశమైన కొలంబియా నుండి దౌత్య వ్యవహారాలను నడిపించింది. ఇటీవల కాలంలో వచ్చిన రాజకీయ మార్పుల వల్ల వెనిజులాలో పరిస్థితులు కొంత చక్కబడ్డాయి. ఈ ఏడాది జనవరిలోనే సీనియర్ దౌత్యవేత్త లారా డోగు కరాకస్ చేరుకోగా, మార్చి 14న ఎంబసీపై అమెరికా జెండాను ఎగురవేశారు.
ప్రస్తుతం వెనిజులాలోని చమురు కంపెనీలకు సహకరించడం మరియు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏడేళ్ల తర్వాత అమెరికా రాయబార కార్యాలయం తిరిగి తెరుచుకోవడం లాటిన్ అమెరికా రాజకీయాల్లో ఒక పెను మార్పుగా కనిపిస్తోంది.