మర్మ చికిత్సపై తానా వెబినార్‌కు భారీ స్పందన..
తానా నిర్వహించిన హోలిస్టిక్ హీలింగ్ క్లాస్ విజయవంతం..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “మర్మ థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్‌మెంట్” హోలిస్టిక్ హీలింగ్ క్లాస్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది. జూమ్ వేదికగా దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రవాస తెలుగువారు చురుకుగా పాల్గొని ఆరోగ్యంపై విలువైన అవగాహన పొందారు. సహజసిద్ధ పద్ధతుల ద్వారా నొప్పి నివారణ, సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రఖ్యాత యోగాచార్య సి.హెచ్. కొండారెడ్డి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఆధునిక జీవనశైలిలో, ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎదుర్కొనే మెడ నొప్పి, వెన్నునొప్పి, ఒత్తిడి వంటి సమస్యలపై ఆయన విస్తృతంగా చర్చించారు. “శక్తి శరీరం” అనే భావనను సులభంగా అర్థమయ్యేలా వివరించి, శరీరంలోని మర్మ స్థానాలను ప్రేరేపించడం ద్వారా మందులు లేకుండానే నొప్పులను తగ్గించుకోవచ్చని తెలిపారు. రోజువారీ జీవితంలో అనుసరించగల సాధారణ పద్ధతులను ఆయన పాల్గొన్నవారితో పంచుకున్నారు.
ఈ సదస్సులో ఆయుర్వేదం, మర్మ చికిత్సల ప్రాముఖ్యతతో పాటు, ఆధునిక సాంకేతికత అయిన కృత్రిమ మేధ (AI) ను ఆరోగ్య రంగంలో ఎలా ఉపయోగించుకోవచ్చన్న అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. ప్రాచీన భారతీయ విజ్ఞానం మరియు ఆధునిక సాంకేతికత కలిస్తే ఆరోగ్యరంగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వక్త అభిప్రాయపడ్డారు. శరీర శక్తి సమతుల్యత, అంతర్గత ప్రేరణ వంటి అంశాలపై కొత్త అవగాహన లభించిందని పాల్గొన్నవారు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం తానా ప్రెసిడెంట్ డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి పర్యవేక్షణలో జరిగింది. తానా యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఈవెంట్ కోఆర్డినేటర్ దశరథ్ తలపనేని ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా నిర్వహించారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీనివాస్ ఓరుగంటి, ట్రస్టీ సతీష్ మేకా, న్యూజెర్సీ ప్రతినిధి సుధీర్‌చంద్ నారెపాలేపు, కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూయార్క్ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు పాల్గొన్నారు.
కార్యక్రమ సమన్వయంలో వాలంటీర్లుగా శ్యామ్ ప్రసాద్ అంబటి, భగత్ మారెళ్ల, సర్వేష్ ఎర్రగుంట్ల, రామకృష్ణ చెరుకూరి, వెంకట్ పుసులూరి, కిరణ్ బసన, ఆకాంక్ష తలపనేని, యషశ్రీ పట్నాల ముఖ్య పాత్ర పోషించారు. తమ సమయాన్ని కేటాయించి జ్ఞానాన్ని పంచిన యోగాచార్య కొండారెడ్డి గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస తెలుగువారందరికీ తానా న్యూజెర్సీ టీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ప్రవాస తెలుగువారి ఆరోగ్యం, సంక్షేమం, సాంస్కృతిక అభివృద్ధి లక్ష్యంగా ఇలాంటి విజ్ఞానదాయక కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిరంతరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. “మీ ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధే మా కార్యక్రమాలకు ప్రేరణ” అంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.