ప్రవాస భారతీయులతో మమేకమైన మంత్రి సత్య కుమార్ యాదవ్..
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై ప్రవాసులకు మంత్రి వివరాలు..
సింగపూర్‌లోని సెంగ్కాంగ్ ప్రాంతంలో ఉన్న లా ఫియెస్టా కాండోమినియంలో, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్‌తో ముఖాముఖీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన సంస్థ సభ్యులు మంత్రివర్యులకు సాదర స్వాగతం పలికి సత్కరించారు.
సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ, మంత్రివర్యులు తమ బిజీ షెడ్యూల్ మధ్యలో ప్రవాస తెలుగు వారితో కలిసేందుకు సమయం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కేవలం ఆరు గంటల ముందే కార్యక్రమం ప్రణాళిక చేసినప్పటికీ, 50 మందికి పైగా హాజరుకావడం తమకు సంతోషాన్ని కలిగించిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ, సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రవాస తెలుగు సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే “మన్ కీ బాత” కార్యక్రమాన్ని వీక్షించామని తెలిపారు. అనంతరం ఇలాంటి సమావేశంలో పాల్గొని మాట్లాడే అవకాశం రావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.
గత దశాబ్దంలో భారతదేశం సాధించిన పురోగతిని ఆయన వివరించారు. ఒకప్పుడు ‘ఫ్రాజైల్ ఫైవ్’గా పరిగణించబడిన భారత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ప్రపంచంలో అగ్ర ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి ఎగుమతుల్లో ముందంజలో నిలిచిన దేశంగా మారిందని, సంక్షోభాలను ఎదుర్కొనే స్థితి నుంచి అవకాశాలను సృష్టించే దిశగా భారత్ పయనిస్తున్నదని వివరించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశ అభివృద్ధి, దృష్టి, ఆకాంక్షలతో ప్రవాస భారతీయులకు ఉన్న అనుబంధం ఎంతో బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయమై మాట్లాడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు పాతూరి, చామిరాజు రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ నిట్టల, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షుడు రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు గుత్తుల రవికుమార్, వేణు మల్లవరపు తదితరులు హాజరయ్యారు.
మంత్రివర్యులతో సమన్వయం చేసిన సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమం నిర్వహణలో సహకరించిన దాములూరి భరత్, వెంకట్ భీమినేని, యోగి బూరుగపల్లి, సాంకేతిక సహాయం అందించిన రాధాకృష్ణ గణేశ్‌కు, భోజన ఏర్పాట్లు చేసిన సరిగమ రెస్టారెంట్ యజమాని సురేంద్ర చేబ్రోలు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.