భారత్-అమెరికా సంబంధాలపై కీలక చర్చలకు రంగం సిద్ధం..
క్వాడ్ సదస్సులో పాల్గొననున్న అమెరికా విదేశాంగ మంత్రి..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన సతీసమేతంగా కోల్‌కతాకు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సేవా సంస్థ నిర్మలా శిశుభవన్‌ను సందర్శించిన రుబియో, అక్కడి సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనబరిచారు. చిన్నారులతో మాట్లాడి వారి సంక్షేమంపై ఆరా తీశారు.
ఈ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీతో మార్కో రుబియో సమావేశం కానున్నారు. భారత్-అమెరికా సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, భద్రతా అంశాలపై ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న కొన్ని దౌత్యపరమైన ఉద్రిక్తతలపై కూడా చర్చ జరిగే అవకాశముందని విదేశాంగ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే భారత్‌లో జరుగుతున్న క్వాడ్ సదస్సులో కూడా అమెరికా తరఫున మార్కో రుబియో పాల్గొననున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం, చైనా ప్రభావం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.
రేపు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో మార్కో రుబియో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇంధనం, వాణిజ్యం, క్రిటికల్ టెక్నాలజీ, రక్షణ రంగ సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సరఫరాపై వాటి ప్రభావం వంటి అంశాలు కూడా ఈ పర్యటనలో కీలకంగా మారనున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.