ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు..
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కూటమి సమన్వయం కీలకం: సీఎం చంద్రబాబు..
టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వర్క్‌షాప్ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) పాల్గొన్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరై ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో విజయానికి ఓటర్ల జాబితా ఎంత కీలకమో వివరిస్తూ ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన మహానాడును వర్చువల్ విధానంలో అద్భుతంగా నిర్వహించుకున్నామని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగిన మహానాడులో సుమారు 24.50 లక్షల మంది పాల్గొనడం పార్టీ బలాన్ని చూపించిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు కూడా జరుగుతోందని వివరించారు.
2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఈ రివిజన్ ప్రక్రియను చేపడుతున్నారని, జులై 14లోపు రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్ జరుగుతుందని తెలిపారు. ఆలోపు కొత్త ఓట్ల నమోదు, మార్పులు, సవరణలు పూర్తిగా ఖచ్చితంగా పూర్తి కావాలని ఆయన సూచించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా SIRను చాలా సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఓటు నమోదు చేయించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజల్లో అవగాహన కల్పించడం రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ ఓటర్ల జాబితాపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని అనేక మంది ప్రజలు ఉద్యోగాలు, విద్య, ఉపాధి కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని, అలాంటి వారిని గుర్తించి ఓటర్ల జాబితాలో నమోదు చేయడం చాలా అవసరమన్నారు. గత ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు కూటమికి 164 స్థానాల ఘన విజయాన్ని అందించారని గుర్తు చేశారు.
కూటమి రాజకీయాలపై కూడా చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ఎల్లప్పుడూ జనసేన, బీజేపీలతో సమన్వయం కొనసాగాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా మిత్రపక్షాలతో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. SIR ప్రక్రియనే కూటమి పార్టీల మధ్య సమన్వయానికి తొలి పరీక్షగా అభివర్ణించారు.
తన రాజకీయ జీవితంలో 2024 ఎన్నికల లాంటి ఘన విజయం ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా కూటమి అభ్యర్థులనే భావించి ప్రజలు భారీగా ఓటేశారని తెలిపారు. అది ప్రజల్లో కూటమిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
“చాలా మంది అనుచరులను కోరుకుంటారు... కానీ నేను నాయకులను కోరుకుంటాను” అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు.
2024 ఎన్నికల ముందు జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను గుర్తు చేస్తూ, పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్, టెక్నికల్ ప్లానింగ్‌తో ఆ ఎన్నికల్లో విజయాన్ని సాధించామని తెలిపారు. ఒకప్పుడు పోటీ చేయని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచామంటే అది పార్టీ నెట్‌వర్క్ బలమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.