ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ కీలక నేతలు వరుసగా వివాదాస్పద కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మంది అరెస్ట్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడమే కాకుండా, మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడం తీవ్ర సంచలనం కలిగించింది.
ఈ నేపథ్యంలో మరో వైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన ఇచ్చిన మృతశాఖ వివరాల ఆధారంగా ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా ఉచ్చు బిగుస్తుందని సమాచారం.
శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంలో, తాను కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి అక్రమ మైనింగ్ వ్యాపారాల్లో భాగస్వాములమని వెల్లడించినట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా తవ్విన టన్నుల క్వార్ట్జ్ కోసం రూ. 7,000 నుంచి రూ. 10,000 వరకు మామూలు వసూలు చేశారని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమంగా వచ్చిన డబ్బుతో గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, గ్రీన్ మెడోస్, స్వర్ణముఖి స్మార్ట్ సిటీ, హెవెన్లీ హోమ్స్ వంటి పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో మణికొండ, తుర్కయాంజల్ వద్ద ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనిల్ కుమార్ పై విచారణ కొనసాగుతుండటంతో, ఏ చర్యలు తీసుకుంటారన్న అంశంపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.