Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Desi Chicken vs Broiler: బ్రాయిలర్ కోళ్లు కేవలం 6 వారాల్లోనే ఎలా పెరుగుతాయి? వాటికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారనే వార్తల్లో వాస్తవం ఎంత? దేశీ కోడికి, బ్రాయిలర్ కోడికి ఉన్న తేడాలేంటి?

Published : 2026-03-07 17:48:00

చికెన్ ప్రియులకు ‘బ్రాయిలర్’ కోడి గురించి తెలియనిది కాదు. కేవలం 40 నుండి 50 రోజుల్లోనే  మార్కెట్‌లోకి వచ్చే ఈ కోళ్లను చూసి చాలా మంది భయపడుతుంటారు. వీటికి ఏవైనా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వీటిని తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కావని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ కోళ్లు ఇంత వేగంగా పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చాలా మంది అనుకునేట్లుగా బ్రాయిలర్ కోళ్లకు గ్రోత్ హార్మోన్లు లేదా స్టెరాయిడ్లు ఇవ్వడం అనేది పూర్తిగా తప్పు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణికం వంటి నిపుణులు ప్రకారం... భారతదేశంలో పౌల్ట్రీ రంగంలో హార్మోన్ల వాడకంపై నిషేధం ఉంది. పైగా, లక్షల సంఖ్యలో ఉండే కోళ్లకు ఒక్కొక్కటిగా ఇంజెక్షన్లు ఇవ్వడం అనేది ఖర్చుతో కూడుకున్న పని  ఆచరణలో సాధ్యం కాని విషయం.

అంతర్జాతీయ జర్నల్ నివేదికల ప్రకారం, బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి..

జన్యుపరమైన ఎంపిక:  శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి, కేవలం త్వరగా పెరిగే లక్షణం ఉన్న కోడి జాతులను మాత్రమే ఎంపిక చేసి అభివృద్ధి చేశారు. ఇది కేవలం వంశపారంపర్యంగా వచ్చే మార్పు మాత్రమే గానీ, కృత్రిమంగా చేసింది కాదు.

పోషకాహారం  సంరక్షణ: ఈ కోళ్లకు ఇచ్చే దానాలో అత్యధిక పోషకాలు ఉంటాయి. వాటికి అవసరమైన ఉష్ణోగ్రతను కల్పిస్తూ, ఎటువంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తగా పెంచుతారు. తక్కువ శ్రమ, ఎక్కువ తిండి వల్ల అవి త్వరగా కండలు పడతాయి.

దేశీ కోడి వర్సెస్ బ్రాయిలర్ కోడి: దేశీ కోళ్లు బయట తిరుగుతూ, సహజమైన ఆహారం తింటూ పెరుగుతాయి. అందుకే అవి పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది, వాటి మాంసం కూడా గట్టిగా ఉండి రుచిగా అనిపిస్తుంది. బ్రాయిలర్ కోళ్లు ఒకే చోట ఉండి కేవలం ఫీడ్ మాత్రమే తింటాయి కాబట్టి, వాటి మాంసం చాలా మెత్తగా ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం దేశీ కోడి కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల నేరుగా ప్రమాదం ఏమీ లేదు. అయితే, మీరు తీసుకునే చికెన్ నాణ్యతను గమనించడం ముఖ్యం. కొందరు దేశీ కోడి రుచిని ఇష్టపడితే, మరికొందరు తక్కువ ధరలో లభించే బ్రాయిలర్ వైపు మొగ్గు చూపుతారు. ఏది తిన్నా సరే, శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తినడం ఆరోగ్యానికి మంచిది. సోషల్ మీడియాలో వచ్చే  వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  సూచిస్తున్నారు.

Spotlight

Read More →