ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో విశాఖ పట్టణాన్ని ఒక కొత్త సింగపూర్‌గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పర్యాటకులను ఆకర్షించే వినూత్న ప్రాజెక్టులు అమలు అవుతున్నాయి. ఇటీవల కైలాసగిరిపై చేపట్టబోయే “త్రిశూలం ప్రాజెక్ట్”కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోం శాఖ మంత్రి శ్రీమతి అనితలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కైలాసగిరి కొత్త పర్యాటక ఆకర్షణగా మారనుంది. విశాఖలో పర్యాటకానికి మరో గుర్తింపు లభించేలా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కైలాసగిరిలో ప్రాజెక్ట్ శంకుస్థాపన అనంతరం, మంత్రులు ఆర్కే బీచ్ రోడ్డులోని సబ్‌మెరిన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన UH3H హెలికాప్టర్ మ్యూజియంను ప్రారంభించారు. ఇది పర్యాటకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించనుంది. బీచ్ రోడ్‌ను సందర్శించే వారికీ ఈ మ్యూజియం కొత్త ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే సబ్‌మెరిన్ మ్యూజియం, విమాన మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, కొత్తగా హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభం కావడం విశాఖకు మరో ప్రతిష్టాత్మక చిహ్నంగా నిలవనుంది.
ఈ సందర్భంలో ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖపట్నం పర్యాటక అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు, ఆధునిక సదుపాయాలతో పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు లభిస్తుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన వివరించారు.
సముద్ర తీరప్రాంతం, కొండలు, సుందర దృశ్యాలు, ఆధునిక మ్యూజియాలు కలగలసిన విశాఖ, దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులకు కూడా ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారుతోంది. కొత్త ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలు అయిన తర్వాత విశాఖపట్నం పర్యాటకరంగం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.