ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాలు (Caste Certificates) వేగంగా జారీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇంటింటి సర్వే నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబంలోని కుల సంబంధిత సమాచారాన్ని సేకరించి, ఆధారంగా సర్టిఫికెట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈసారి OC కులాల వివరాలను కూడా నమోదు చేయనున్నారు. అక్టోబరు 2 నాటికి ఈ సర్వే పూర్తయ్యేలా ప్లాన్ చేశారు.
ఈ సర్వేను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS), రెవెన్యూ శాఖ, గ్రామ/వార్డు సచివాలయాలు కలిసి చేపడతాయి. ముందుగా ఉన్న ప్రభుత్వ డేటాను ఆధారంగా తీసుకుని, వీఆర్వోలు ఇంటింటికి వెళ్లి, వాటిని దృవీకరించనున్నారు. గతంలో ఈ ప్రక్రియ ముఖ్యంగా SC, ST, BC కులాలకు పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు OCల కుల వివరాలు కూడా తీసుకోవడం విశేషం. ఇది సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించే దిశగా ముందడుగు.
ఇక భవిష్యత్తులో ఈ డేటాను ఇతర పథకాల అమలుకు కూడా ఉపయోగించనున్నారు. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో tamper-proof (మార్చలేని) caste certificates జారీ చేయనున్నారు. దీని కోసం blockchain technology ఉపయోగించనున్నారు. ఇది డేటా భద్రతకు ఒక కీలక అడుగు. ఈ సర్టిఫికెట్లు త్వరగా, పారదర్శకంగా ప్రజలకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇంతకుముందు ప్రభుత్వ పథకాల అమలులో ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది అర్హులు అవకాశాలను కోల్పోయారు. ఇప్పుడు ఈ సర్వే వల్ల అటువంటి పరిస్థితులు ఎదురుకాలేవని ప్రభుత్వం భావిస్తోంది. ఇది సాంకేతికత ఆధారంగా పరిపాలనలో ప్రగతికి, సామాజిక న్యాయానికి దోహదపడే చర్యగా మిగిలిపోతుంది.