ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ మరోసారి ఘాటుగా తన స్థానం తెలియజేసింది. జమ్మూకశ్మీర్ భారత్ విడదీయరాని భాగమని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను నిలిపివేయాలని ఆయన ఐక్యరాజ్యసమితి ముందు డిమాండ్ చేశారు.
80వ యూఎన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జరిగిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ బహిరంగ చర్చలో ఆయన మాట్లాడుతూ పాక్ చర్యలను తీవ్రంగా విమర్శించారు.
పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల్లో ప్రజలు సైనిక అణచివేత, క్రూరత్వం, వనరుల దోపిడీకి గురవుతున్నారు. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను తక్షణం ఆపాలని మేము పిలుపునిస్తున్నాము అని హరీశ్ ఘాటుగా హెచ్చరించారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంత ప్రజలు భారత రాజ్యాంగం కింద తమ హక్కులను వినియోగిస్తున్నారు. కానీ ఈ ప్రజాస్వామ్య విలువలు పాకిస్థాన్‌కి అర్థం కావు అని వ్యాఖ్యానించారు.
భారత్ ఎప్పటికీ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూసే దృక్పథం కలిగిన దేశమని వసుధైవ కుటుంబం మా తత్వం న్యాయం, గౌరవం, అవకాశాలు, సంపద అందరికీ అందించాలనే దానిలోనే మా విశ్వాసం ఉంది అని ఆయన గుర్తు చేశారు. భారత్ ఎల్లప్పుడూ అంతర్జాతీయ సహకారం బహుపాక్షిక విధానాల పట్ల కట్టుబడి ఉంటుందని తెలిపారు.
అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో యూఎన్ ప్రాముఖ్యత, విశ్వసనీయత, సమర్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుపాక్షిక సంస్థగా యూఎన్‌కి ఇప్పుడు విశ్వసనీయత సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ చర్చ సమయోచితమైంది అని అన్నారు.